దేశాభివృద్ధిలో సర్వే శాఖ కీలకం | - | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో సర్వే శాఖ కీలకం

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

గుంటూరు సీఐడీ డీఎస్పీ బదిలీ

గుంటూరు మెడికల్‌: ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 10న నిర్వహించే ‘జాతీయ సర్వే దినోత్సవం’ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ సర్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ భవనంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవ అతిథులుగా ఏపీ ఎన్జీజీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, సర్వే శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ తోయజాక్షరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌లు జాతీయ సర్వే దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలకు గౌరవ అతిథులు బహుమతులు అందజేశారు. రక్తదాన శిబిరంలో 36 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు తమ వంతు సహాయాన్ని అందించారు. ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో సర్వే శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమాజ సేవలో భాగంగా రక్తదానం వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సర్వే ఉద్యోగులు సామాజిక బాధ్యతను చాటుతున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్వే ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బి.లక్ష్మీనారాయణ, డివిజనల్‌ అధ్యక్షుడు కట్ట వరప్రసాద్‌, ఎం.శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీ జీవో సిటీ ఉపాధ్యక్షుడు భావన్నారాయణ, సర్వే అధికారులు, సర్వే ఉద్యోగులు పాల్గొన్నారు.

నగరంపాలెం: గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే డీఎస్పీ బి.సునీల్‌ బదిలీయ్యారు. కొద్దిరోజుల కిందట రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డీఎస్పీల బదిలీలు జరగ్గా, ఆయన్ను విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ డీఎస్పీగా బదిలీ చేశారు. గుంటూరు సీఐడీలో సుమారు ఏడాదిపాటు సునీల్‌ విధులు నిర్వర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement