తాడికొండ: రాజధానిలో పర్యావరణ పర్యాటకమే ప్రధాన లక్ష్యంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్లు అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్ష్మీ పార్థసారథి పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ బ్యాంకు సాంకేతిక ప్రతినిధులైన యోహన్నెస్, స్కాట్ తదితరులతో అమరావతిలో ఏడీసీ చేపడుతున్న గ్రావిటీ కెనాల్, నీరుకొండ, పెనుమాక, ట్రాన్స్ లొకేషన్ ప్రదేశాలను సందర్శించారు. 7.8 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ గొప్ప పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 5.9 కి.మీ. పనులు పూర్తిచేశామని, రాజధాని ప్రాంతంలో వరద నీరు, లాం నుంచి కొండవీటి వాగుకు వచ్చే అదనపు నీటిని ఈ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలుపుతున్నామని పేర్కొన్నారు. గ్రావిటీ కెనాల్ పరీవాహక ప్రాంతమంతా ప్రపంచ ప్రఖ్యాత స్థాయి నిపుణుల ఆలోచనలతో అవెన్యూ ప్లాంటేషన్‌న్‌తో బోటింగ్ వంటి ఆహ్లాదకరమైన ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అనంతవరంలోని ఏడీసీ ట్రాన్స్ లొకేషన్ నర్సరీని పరిశీలించిన బృందానికి అక్కడ చేపట్టిన పనులపై అవగాహన కల్పించారు. రాజధాని నగరంలో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న భారీ వృక్షాలను ఇక్కడకు తీసుకొచ్చి వాటిని సంరక్షించి తిరిగి అవసరమైన ప్రదేశాలలో నాటుతున్నామని చెప్పారు. ఇక్కడ అనేక ఔషధ గుణాలున్న వివిధ రకాల మొక్కలను సంరక్షిస్తున్నామన్నారు. మున్ముందు అమరావతిలో నివసించే జనాభా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు ఉదయం వ్యాయామానికి ఈ ట్రాన్స్ లొకేషన్ నర్సరీ తోడ్పడుతుందన్నారు. ఏడీసీ ట్రాన్స్ లొకేషన్ ఒక అద్భుతమని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కితాబిచ్చారు. నీరుకొండ గ్రామంలో 440 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నట్లు బృంద సభ్యలకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటి వరకు 30 శాతం పనులు పూర్తయ్యాయని వచ్చే మార్చి నాటికి రిజర్వాయర్ పూర్తిస్థాయిలో అందుబాటులోనికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెనుమాక రిజర్వాయర్‌ను సందర్శంచిన బ్యాంకు ప్రతినిధులకు సూచిస్తూ 190 ఎకరాలలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ఉండవల్లిలోని కొండవీటివాగు ఫ్లడ్ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించిన బృందానికి ఏడీసీ అధికారులు వరదనీటి ఎత్తిపోతల గురించి వివరించారు. పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు బి.నరసింహమూర్తి, సిహెచ్.ధనుంజయ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు కె.బసవేశ్వరరావు, ఎంవీఆర్ ఇనన్‌ఫ్రా, ఆర్‌వీఆర్ ఇంజినీంగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


