పొన్నూరును అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించారు ప్రజల్లోకి రాకుండా ఇంట్లో ఉండే ఆయనకు పదవి ఎందుకు? ఎమ్మెల్యే అక్రమాలతో హడలెత్తిపోతున్న అధికారులు వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ గూండాలతో దాడులు పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్: అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆ పదవికి అనర్హుడని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం బృందావన్ గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొనే నరేంద్ర పొన్నూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని, అక్రమంగా వసూళ్లు చేసుకోవడమే దినచర్యగా మారిందని, నియోజకవర్గంలో ఎక్కడైనా కొత్తగా లేఔట్ వేస్తే నరేంద్రకు రూ.కోటి ముట్టచెప్పాల్సిందేనని ఆరోపించారు. భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చిన ఫలితంగా చేబ్రోలు సబ్ రిజిస్ట్రార్ సెలవులోకి వెళ్లిపోయారని అన్నారు. మూడు రోజుల క్రితం వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్టీ విభాగ ప్రధాన కార్యదర్శి దేవరకొండ గోపీపై పొన్నూరు బస్టాండ్ సెంటర్లో టీడీపీ రౌడీషీటర్లు భవానీ శంకర్, దుర్గాప్రసాద్, చందు అత్యంత పాశవికంగా దాడి చేశారని ఆరోపించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారని చెప్పారు. అదే విధంగా జగ్జీవన్‌రామ్ జయంతి, ఈస్టర్ కార్యక్రమాల్లో ఉన్న తమ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు వెంకటరత్నం, మనోహర్, జేమ్స్‌పై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర తన సొంత తమ్ముడితో తన సామాజిక వర్గానికే చెందిన యలవర్తి నాగేశ్వరరావు అనే వ్యక్తిని నిడుడ్రోలు బ్రిడ్జిపై హత్య చేయించారని, ఆ హత్యా నేరంలో పాలుపంచుకున్న ధూళిపాళ్ల నరేంద్ర తమ్ముడితో సహా ఆరుగురు నిందితులు విచిత్ర వ్యాధితో చనిపోవడం పాపాలు పండిన వైనాన్ని గుర్తు చేస్తోందని విమర్శించారు. పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం ఊసే లేకుండా అవినీతి, అక్రమ సంపాదన, రౌడీయిజంతో దళితులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకే ఎమ్మెల్యే పరిమితం అయ్యారన్నారు. ప్రజల్లోకి రాకుండా ఇంట్లో ఉండే ఆయనకు పదవి ఎందుకని ప్రశ్నించారు.
అసాంఘిక కార్యకలాపాలు
చింతలపూడి గ్రామంలో కూచిపూడి నరేంద్ర తన చావుకు ఎమ్మెల్యే నరేంద్ర వేధింపులే కారణమని వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచి, అసాంఘిక కార్యకలాపాలకే పరిమితమైన నరేంద్రకు వచ్చే ఎన్నికల్లో తిరిగి టిక్కెట్ కేటాయించే పరిస్థితులు లేవని తెలిసి, పేట్రేగిపోతున్నారని ఆరోపించారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ గూండాలపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. రెండు గంటలపాటు ధర్నాకు దిగితే, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారని తమపైనే కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా తరువాతే దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతామని సీఐ లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారని చెప్పారు. 307 సెక్షన్ కూడా నమోదు చేయకుంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మొక్కజొన్నకు మద్దతు ధర అందకుండా, దళారులతో తక్కువ ధరకు కొనుగోలు చేయిస్తూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కొమ్మమూరు బ్రిడ్జి పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ చేతులు ఎత్తేశారని, తాజాగా అక్కడ పాత బ్రిడ్జిపై నుంచి లారీ కాలువలోకి బోల్తా పడిందని చెప్పారు. సమావేశంలో వైసీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, బందెల ఉదయ్ శంకర్, విద్యార్థి విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భానుకిరణ్, జిల్లా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి పెనుమాల అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


