దాచేపల్లి: మండలంలోని తంగెడ భవ్య సిమెంట్‌కు చెందిన దయానంద్ ఆంగ్లో వేదిక్(డీఏవీ) పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం యజమాన్యం ఏర్పాటు చేయటంతో 300 మందికిపైగా తల్లిదండ్రులు వచ్చారు. డీఏవీ పాఠశాలను ఇప్పటి నుంచి చెట్టినాడ్ విద్యా మందిర్‌గా మార్పు చేస్తున్నామని, ఇప్పటి వరకు విద్యార్థులకు చెప్పిన సీబీఎస్‌ఈ సిలబస్ బదులుగా స్టేట్ సిలబస్ చెబుతామని ఈ సమావేశంలో యజమాన్య ప్రతినిధులు ప్రకటించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ ఏర్పాటు చేసిన నాటి నుంచే ఇక్కడ సీబీఎస్‌ఈ సిలబస్‌ని విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇప్పుడు ఆ సిలబస్ తొలగించి స్టేట్ సిలబస్ చెబితే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్‌ఈ సిలబస్ బోధించాలని, యజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని తల్లిదండ్రులు కోరారు. దీంతో తల్లిదండ్రులకు యజమాన్య ప్రతినిధులు సర్ది చెప్పే యత్నాలు చేశారు.


