వైఎస్సార్ సీపీ యువజన విభాగం
జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ ఉత్తేజ్‌రెడ్డి
పట్నంబజారు: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇస్తామని చెప్పిన 20లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ ఉత్తేజ్‌రెడ్డి ప్రశ్నించారు. బృందావన్‌గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా, నాలుగు లక్షల ఉద్యోగాలు తీసేశారని, ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్‌ను 10వేల ఉద్యోగాలతో విడుదల చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అది కూడా విడతల వారీగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వ తీరు పబ్లిసిటీ పీక్.. ఫెర్మాఫెన్స్ వీక్ అనే చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కూటమి సర్కార్ ఏర్పడిన తరువాత మూడు బడ్జెట్‌లు ముగిశాయని, నిరుద్యోగ భృతి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. చంద్రబాబు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారని, అవి ఎక్కడెక్కడ ఇచ్చారో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యువతకు సంబంధించి ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ఉంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.


