టెన్త్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

Feb 28 2026 7:16 AM | Updated on Feb 28 2026 7:16 AM

టెన్త్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

టెన్త్‌ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

మార్చి 16 నుంచి పరీక్షలు

149 కేంద్రాల్లో 26,699

మంది హాజరయ్యేలా ఏర్పాట్లు

జిల్లా కలెక్టర్‌ ఏ తమీమ్‌ అన్సారియా

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పరీక్ష కేంద్రాలకు నియమించిన చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ అధికారులకు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 16వ తేది నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో 149 పరీక్ష కేంద్రాల్లో 26,699 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్‌ రూముల నుంచి ఎస్కాట్స్‌ ద్వారా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నా పత్రాలు తీసుకురావడంతో పాటు నిర్ణీత సమయంలో ఇన్విజిలేటర్లకు సక్రమంగా పంపిణీ జరిగేలా చీఫ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేలా కేంద్రాల్లో ఏర్పాట్లను ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. పరీక్షల సమయంలో వదంతులు వ్యాప్తి చెందకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతిరోజూ పరీక్ష ముగిసిన తర్వాత జవాబు పత్రాలను సక్రమంగా ప్యాకింగ్‌ చేసి పూర్తి భద్రత మధ్య సకాలంలో పోస్ట్‌ ఆఫీస్‌కు అందించాలన్నారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు నిర్లక్ష్యం లేకుండా శిక్షణలో తెలిపిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ పదో తరగతి పరీక్షల విధులు నిర్వహించాలన్నారు. పదో తరగతి పరీక్షలలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు నిర్వర్తించాల్సిన ప్రక్రియలపై రిసోర్స్‌ పర్సన్స్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ప్రాంతీయ సంచాలకులు లింగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాష, డైరెక్టర్‌ కామన్‌ బోర్డు తిరుమలేష్‌, ఎంఈఓలు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement