విజ్ఞాన్‌లో ముగిసిన ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్
అట్టహాసంగా సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్ పోటీలు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ స్పేస్‌టెక్ అకాడమీ మరియు హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ స్పేస్ టెక్ సమ్మిట్–2026’ శనివారం ఘనంగా ముగిసింది. సౌత్ ఇండియా రాకెట్రీ చాలెంజ్ పోటీలు సైతం అట్టహాసంగా ముగిశాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. ముగింపు కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ఏఐఎంఎస్‌సీఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటరామన్ మాట్లాడుతూ ఉపగ్రహ రూపకల్పన నుంచి ప్రయోగం, డేటా స్వీకరణ, ప్రాసెసింగ్, వినియోగం వరకు పూర్తిస్థాయి చక్రం (కంప్లీట్ సైకిల్) సమర్థవంతంగా పనిచేస్తేనే వ్యవసాయం, పట్టణాభివృద్ధి, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లో గణనీయమైన ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు. ఏపీ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ మాట్లాడుతూ భవిష్యత్ ప్రపంచాన్ని నిర్ణయించబోయే రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ కీలకమన్నారు.
విజ్ఞాన్, ఏఐఎంఎస్‌సీఎస్‌ల మధ్య అవగాహన ఒప్పందం
ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్–2026లో భాగంగా విజ్ఞాన్ యూనివర్సిటీ – హైదరాబాద్‌లోని ఏఐఎంఎస్‌సీఎస్ (అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఐఎంఎస్‌సీఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటరామన్‌తో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ అవగాహన ఒప్పందం వలన ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ నేడు అంతరిక్ష పరిశోధనలు లేని ఆధునిక జీవితాన్ని ఊహించలేమని, మన చేతిలోని సెల్‌ఫోన్ నుంచి టీవీ ప్రసారాల వరకు, ఆరోగ్య రంగం నుండి వ్యవసాయం వరకు ప్రతిదీ స్పేస్ టెక్నాలజీతోనే ముడిపడి ఉందన్నారు.
విజేతలకు బహుమతులు
విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు జరిగిన ’ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్–2026’ కు వివిధ ప్రాంతాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు, పాఠశాలల నుంచి సుమారు 250 మందికి పైగా విద్యార్థులు, వందలాది మంది అధ్యాపకులు మరియు ఇస్రో, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల శాస్త్రవేత్తలు పాల్గొని అంతరిక్ష విజ్ఞానాన్ని పంచుకున్నారు. ఈ సమ్మేళనం ముగింపు వేడుకల్లో భాగంగా ప్రతిభ కనబరిచిన విజేతలకు మరియు ఉత్సాహంగా పాల్గొన్న జట్లకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు, మెమోంటులను అందజేశారు. ’సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్’లో 1.5 కిలోమీటర్ల ఎత్తుకు రాకెట్లను ప్రయోగించిన అన్నమాచార్య విద్యాసంస్థల విద్యార్థుల కృషికి దక్కిన గుర్తింపు, మిగిలిన వారందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. చాన్స్‌లర్ పావులూరి సుబ్బారావు, ఏపీ స్పేస్‌టెక్ అకాడమీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.శేషగిరిరావు, ఏపీ సైన్స్ సిటీ సీఈఓ కేశినేని వెంకటేశ్వర్లు, సీఈఓ డాక్టర్ కూరపాటి మేఘన, ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విజ్ఞాన్‌లో ముగిసిన ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్


