ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జీజీహెచ్‌లో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్న పి.హేమలత ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. విజయవాడలోని ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళ విభాగానికి సంబంధించిన ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు చెందిన ఎం.గాయత్రి కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికై న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమలత మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.
కొరిటెపాడు(గుంటూరు): ‘కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్–గుంటూరు’, ‘కోపా–విసన్నపేట’ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలలో భాగంగా చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 247 మంది పేద విద్యార్థులకు రూ.9.50 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో రూ.4.33 లక్షలు తులసి సీడ్స్ వారు ‘కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ ఫూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్’ ద్వారా 114 మంది పేద విద్యార్థులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా, విసన్నపేట లోని వికాస్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభముతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా తులసి గ్రూప్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు హాజరై వితరణ చేయనున్నట్టు ఆయన వివరించారు.
తెనాలి: తెనాలి ప్రాంతానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు, కాలమిస్ట్ వెనిగళ్ల వెంకటరత్నం (88) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో మృతి చెందారు. కొద్దిరోజులుగా అస్వస్థతతో ఉన్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరత్నం స్వస్థలం తెనాలి సమీపంలోని అమృతలూరు మండల గ్రామం గోవాడ. హైస్కూలులో చదివేరోజుల్లోనే సాహిత్యంపై అనురక్తి ఏర్పడింది. తెనాలిలో డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్ వెళ్లారు. కోరమండల్ ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగంలో చేరారు. 1972లో రసరంజని పేరుతో నాటక సంస్థను ఏర్పాటుచేసి నాటకాలు ఆడారు. 1982 నుంచి ప్రీలాన్స్ జర్నలిస్టుగా, కాలమిస్ట్‌గా పదేళ్లపాటు పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు. అందులో హరిత విప్లవకారుడు నార్మన్ బోర్లాగ్‌పై వ్యాసం ప్రముఖమైంది. రసరేఖ పేరుతో హైదరాబాద్‌లో ఆయన నిర్వహించిన మూడురోజుల కార్యక్రమాలు బాగా గుర్తింపు పొందాయి. ఒకప్పుడు రాష్ట్రంలో ఉధృతంగా జరిగిన సారా వ్యతిరేక ఉద్యమంలో ‘సారా పోరు’ బుక్‌లెట్‌ను ప్రచురించారు. తెనాలిపై గల మమకారంతో ‘ఆంధ్రాప్యారిస్ తెనాలి’ పుస్తకాన్నీ తీసుకొచ్చారు. తాను పనిచేస్తున్న కంపెనీలో మేనేజరుగా రిటైరైన వెంకటరత్నం విశ్రాంత జీవితాన్ని హైదరాబాద్‌లోనే గడిపారు.


