చంద్రబాబు ఒక దొంగ దోపిడీదారుడు
15న నిర్వహించనున్న కోటి సంతకాల ర్యాలీ సన్నాహాక సమావేశంలో
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : చంద్రబాబు ఒక దొంగ అని, దోపిడీదారుడని అన్నీ దోచుకోవడమే ఆయన పని అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో కష్టపడి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకొస్తే వాటిని కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 15న జరగనున్న కోటి సంతకాల సేకరణ ర్యాలీకి సంబంధించి శుక్రవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్విహించారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షత వహించారు.
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ మెడికల్ కళాశాలలు కట్టుకుంటూ వస్తే... చంద్రబాబు అమ్ముకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు మేలు చేసేలా 30 ఏళ్ల ముందుకు ఆలోచించి జగన్ విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ నెల15న జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నడుమ లాడ్జిసెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం కలిపి 4,78,589 సంతకాలు పూర్తయినట్లు వివరించారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, జిల్లా, నగర, గ్రామ, మండల, డివిజన్ నుంచి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ర్యాలీలో భాగస్వాములు కావాలని కోరారు.
మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 1.32 కోట్ల ఓట్లు వస్తే కోటి సంతకాల కార్యక్రమానికి 1.40 కోట్లకు పైగా రావడం ద్వారానే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. పేదవాడి ఆర్తనాదాన్ని తెలియజేసేదే ఈ సంతకమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు భవిష్యత్తులో భరోసా నింపడమే ధ్యేయంగా జగన్ 2.0 లక్ష్యమన్నారు.
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రాధాన్యత గుర్తించిన వై.ఎస్.జగన్ వాటిని ప్రజలకు చేరువ చేశాారన్నారు. ఇది కేవలం వైఎస్సార్‌సీపీ పోరాటం కాదని, ఇది ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలే కుప్పకూలి పోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయన్నారు. చంద్రబాబుకు అదేగతి పట్టనుందన్నారు.
పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, అందుకే కోటి సంతకాలు కాకుండా ఏకంగా 1.40 కోట్ల సంతకాలు పూర్తయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీకి పోరాటం కొత్తకాదన్నారు.
మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ టీడీపీ వారే సంతకాలు చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. చంద్రబాబు విధానాలు నచ్చని ఆ పార్టీ వారే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.
తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ వై.ఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదలకు వైద్యం, విద్య అందిందో అది ఇప్పుడు కూడా వారికి అందించేందుకు పోరాడుతున్నారన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, వలి వీరారెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, మండేపూడి పురుషోత్తం, పఠాన్ అబ్దుల్లా ఖాన్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు తాడిబోయిన వేణుగోపాల్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, యేటి కోటేశ్వరరావు యాదవ్, పఠాన్ సైదా ఖాన్, నందేటి రాజేష్, సీడీ భగవాన్, ఉడుముల పిచ్చిరెడ్డి, సుబ్బులు, రూత్‌రాణి, అవినాష్, ప్రభు, వాసిమళ్ల విజయ్, కొండా రవి, తదితరులు పాల్గొన్నారు.


