మొక్కబడిగా పచ్చదనం పెంపు
మిషన్ గ్రీన్ గుంటూరు కింద 5 లక్షల మొక్కలు నాటాలని జీఎంసీ నిర్ణయం ఇప్పటికే లక్షన్నర మొక్కలు నాటినట్లు చెబుతున్న అధికారులు ఏపీ గ్రీన్ కార్పొరేషన్, అటవీశాఖ ద్వారా మిగతా మొక్కలు నాటడానికి చర్యలు ఇప్పటికే నాటిన మొక్కల లెక్కల్లో తేడాలు మొక్కలు తెప్పించే పనిలో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఓ ‘డీఈఈ’ పార్కు ఏడీహెచ్ ఉన్నప్పటికీ ప్రేక్షకపాత్ర వహించలేక రిలీవ్ అయిన వైనం
నెహ్రూనగర్: గుంటూరు మున్సిపాలిటీకి ఇటీవల రెండు లారీల మొక్కలు తెప్పించినప్పటికీ అసలు ఆ మొక్కలు ఎక్కడ నుంచి వచ్చాయో.. ఎన్ని వచ్చాయో అనే సమాచారం మిగతా అధికారులకు కూడా తెలియదంటే అతిశయోక్తి లేదు. గతంలో ఈ మొక్కల వ్యవహారం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ (ఏడీహెచ్) చూసేవారు. కానీ ఇప్పుడు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ)కు నేరుగా బాధ్యతలు అప్పగించడంతో మొక్కల లెక్కల్లో గోల్‌మాల్ జరుగుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొక్కలు తెప్పించడంలో డీఈఈ చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. మొక్కలు తెచ్చేవి గోరంత.. బిల్లు పెట్టేది కొండంత.. అన్నట్లుగా వ్యవహారం ఉందని తెలిసింది. తెచ్చిన మొక్కలు ఏమైపోయాయి అని అడిగితే ఎండిపోయాయని చెప్పడం పరిపాటిగా మారింది. మొక్కల వ్యవహారం అంతా ఆ డీఈఈయే చూసుకోవడంతో ప్రస్తుతం ఇక్కడ పార్కు ఏడీహెచ్‌గా పనిచేస్తున్న శాంతి ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొక్కలు ఏమైనా పాడైపోతే వెంటనే పార్కు సిబ్బందిని పిలిచి అధికారులు మందలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేయలేనని ఏడీహెచ్ శాంతి రిలీవ్ అయి వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో ముగ్గురు ఏడీహెచ్‌లు రిలీవ్ అయ్యారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
సొంత నర్సరీ ఉంటే మేలు...
గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన స్థలాలు నగర పరిధిలో చాలానే ఉన్నాయి. ఆయా స్థలాల్లో మొక్కల పెంపకం, గ్రాస్ పెంచడం వంటి కార్యక్రమాలు చేయడం ద్వారా కార్పొరేషన్ ఆదాయం గండి పడకుండా ఉంటుందని నగరపాలక సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. నర్సరీలు లేకపోవడంతో ఎప్పుడైనా బయటి నుంచి మొక్కలు తెప్పించినప్పుడు వాటిని రిజర్వాయర్ల వద్ద గుట్టలు గుట్టలుగా పడేస్తున్నారు. తర్వాత అటువైపు చూసేవారే లేకపోవడంతో అవి పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితులు ఉన్నాయి.
గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. మిషన్ గ్రీన్ గుంటూరు కింద 5 లక్షల మొక్కలు నాటాలని జీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 1.50 లక్షలు మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన మొక్కలు ఏపీ గ్రీన్ కార్పొరేషన్, అటవీ శాఖ ద్వారా తెప్పించి నాటడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ మొక్కలు తెప్పించడంలో ఓ డీఈఈ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నగరం సుందరీకరణలో భాగంగా పలు డివైడర్లలో ఉన్న పాత మట్టినంత తీసేసి కొత్త మట్టిని నింపారు. అదే విధంగా సదరు డివైడర్లలో మొక్కలు నాటుతున్నారు. అయితే వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మొక్కలు పాడైపోతున్నాయి. నిర్వహణ చూసుకోవాల్సిన సిబ్బంది సుమారు 80 మంది ఉంటే కేవలం 30 మందిలోపే విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. మిగిలిన వారంతా పార్కుల కింద జీతాలు రాయించుకుంటూనే నగరపాలక సంస్థ కార్యాలయంలో డెప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని అడిగే వారు లేకపోవడంతో ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.


