అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ అధికారంలోకి వస్తే న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరిస్తామని చెప్పిన టీడీపీ నాయకులు గెలిచిన తర్వాత ఇచ్చిన పహామీలు గాలికి వదిలేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయబోమని చెప్పడం తగదన్నారు. అంగన్వాడీలకు యాప్‌ల భారాన్ని రద్దు చేయాలన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో హెల్పర్లకు ప్రమోషన్లు ఆపటం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధనలక్ష్మి, ఏవీఎన్ కుమారి గౌరవాధ్యక్షుడు జి రమణ, ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి, రత్న మంజుల, ప్రేమ్ కుమారి, సీఐటీయూ నాయకులు దుర్గారావు హుస్సేన్ వలి, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా


