ప్రైవేటుపై పోరు.. సంతకాల జోరు !
అనూహ్య మద్దతు
● వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై
వైఎస్సార్‌సీపీ ఉద్యమం
● తాడికొండ నియోజకవర్గంలో
64 వేలు దాటిన సంతకాలు
● చంద్రబాబు సర్కారు తీరుపై
అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత
తాడికొండ: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ, పేదలకు వైద్య సేవలను అందకుండా చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గంలో జోరుగా సాగింది. అక్టోబర్ 16వ తేదీన ఉద్యమాన్ని నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యకర్తలు, నాయకులను ఉత్సాహపరుస్తూ నియోజకవర్గంలోని 4 మండలాల్లో కార్యక్రమం చురుగ్గా సాగింది. ప్రణాళికాబద్ధంగా మండల, గ్రామ కమిటీలతో పాటు క్లస్టర్ ఇన్‌చార్జుల నియామకంతో సేకరణ ఉత్సాహంగా కొనసాగింది. 4 మండలాల పార్టీ అధ్యక్షులు వంగా పోలారెడ్డి, మార్పుల శివరామిరెడ్డి, తాళ్ళూరి వంశీకృష్ణ, మైనేని నాగమల్లేశ్వరరావుల ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర, మండల, గ్రామ అనుబంధ కమిటీ సభ్యులు ఇంటింటికీ తిరిగి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో నష్టాలను తెలియజేసి సంతకాలను సేకరించారు. అన్నివర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ప్రైవేటు వారితో లాలూచీ పడిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
తాడికొండ నియోజకవర్గంలో 64 వేలకుపైగా సంతకాలు సేకరించారు. ప్రజల నుంచి అనూహ్య మద్దతు తోడవడంతో సంతకాల సేకరణ జోరుగా సాగింది. చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సూపర్ సిక్స్ పేరుతో ఓట్లు దండుకొని హామీల అమలుపై మొండిచేయి చూపించిన వైనంపై ప్రజలు ఇప్పటికే మండిపడుతున్నారు. గ్రామాల్లో సంతకాల సేకరణకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు... చంద్రబాబు చేసిన మోసం గురించి ప్రజలకు వివరించినప్పుడు సర్కారుపై వ్యతిరేకత స్పష్టం కనిపించింది. పేదల కోసం ఉన్నత ఆశయంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
తాడికొండ నియోజకవర్గంలో అక్టోబర్ 16న కోటి సంతకాల సేకరణ
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు
తాడికొండ మండలం దామరపల్లిలో కోటి సంతకాల సేకరణ
నిర్వహిస్తున్న నాయకులు
ప్రైవేటుపై పోరు.. సంతకాల జోరు !
ప్రైవేటుపై పోరు.. సంతకాల జోరు !


