గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
●రెండు కిలోల గంజాయి స్వాధీనం
●వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్
లక్ష్మీపురం: గంజాయి క్రయ, విక్రయాలు జరుపుతున్న ఆరుగురిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ వివరాలు వెల్లడించారు. శనివారం రాత్రి 10 గంటలకు నగరంపాలెం సీఐ సత్యనారాయణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీఐపీ రోడ్డులోని లాలుపురం వెళ్లే డొంక సమీపంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలం వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఎస్‌ఐ ప్రసన్నకుమార్ పోలీసు బృందంతో అక్కడికి చేరుకున్నారు. కొంతమంది పోలీసులను చూసి పారిపోతుండగా సీఐ తన సిబ్బందితో వెంబడించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి చేతుల్లో ఉన్న కవర్లను పరిశీలించగా గంజాయి ఉండటం గుర్తించి, వెంటనే వాటిని సీజ్ చేసి, పట్టుబడిన ఆరుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి క్రయ, విక్రయాలు జరుపుతుండగా పట్టుబడిన వారిలో ఐదుగురిపై పలు స్టేషన్‌లలో కేసులు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో ఇంకా కొంత మంది నిందితులను గుర్తించామని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. కేసులో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి, మాదక ద్రవ్యాలు ఎక్కడైనా సరఫరా చేస్తున్నట్లు గాని, వినియోగిస్తున్నట్లు గాని తెలిస్తే చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఈ కేసులు నగరంపాలెం సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రసన్నకుమార్, హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌బాబు, దాసు, కానిస్టేబుల్ శ్రీనివాసు, ఉదయ్, నాగేశ్వరరావు, నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన వీరిందరిని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.


