సమాజ శ్రేయస్సుకు హోంగార్డుల సేవలు
నగరంపాలెం: పోలీస్ బలగాలతో సమానంగా హోంగార్డులు కూడా ప్రజా రక్షణ, సమాజ శ్రేయస్సుకు విశేష సేవలు అందిస్తున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం పోలీస్ కవాతు మైదానంలో శనివారం 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం జరిగింది. హోంగార్డులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా, గౌరవ వందనాన్ని జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు హోంగార్డులు నిస్వార్థంగా సేవ చేస్తున్నారని అన్నారు. జిల్లాలో 520 మంది హోంగార్డులు నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. కరోనా సమయంలోనూ ధైర్యంగా విధులు నిర్వర్తించారని.. వారి సేవలు మరువలేమని పేర్కొన్నారు. పరేడ్ కమాండర్ హోంగార్డు ఎండీ.సంధాని నేతృత్వంలో నిర్వహించిన పరేడ్ మార్చ్ ఆకట్టుకుంది. వివిధ పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులను జిల్లా ఎస్పీ అందించారు. అనంతరం హోంగార్డులు నగరంపాలెంలోని మూడు బొమ్మల కూడలి ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, హోంగార్డు ఆర్‌ఐ సురేష్, డీఎస్పీలు శ్రీనివాసులు (ఎస్‌బీ), అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), అరవింద్ (గుంటూరు పశ్చిమ), భానోదయ (గుంటూరు దక్షిణ), సీఐలు శ్రీనివాసరావు (ఎస్‌బీ), ఆర్‌ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


