అంతర్జాతీయంగా పరిశోధన విస్తరణే లక్ష్యం
యువశాస్త్రవేత్త డాక్టర్ భోగాది శుభశ్రీ
తెనాలి: మధుమేహ బాధితుల గాయాలు కేవలం వారి శరీర సమస్య మాత్రమే కాదనీ వారి రోజువారీ జీవనాన్ని, కుటుంబ జీవితాన్ని, సామాజిక సౌకర్యాలను ప్రభావితం చేసే సమస్యగా యువశాస్త్రవేత్త డాక్టర్ భోగాది శుభశ్రీ చెప్పారు. మధుమేహ గాయాలు వేగవంతంగా మానేందుకు అవసరమైన పరిశోధన చేసి పీహెచ్‌డీ స్వీకరించిన డాక్టర్ శుభశ్రీ శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ చికిత్సను సులభతరం చేయడం, రోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటం, సామాజిక బాధ్యతను తీర్చడమనే లక్ష్యంతో ఈ పరిశోధన అంశాన్ని తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనను విస్తరించి, కొత్త సాంకేతికతలు, రీజనరేటివ్ వైద్య పరిష్కారాలు, స్మార్ట్ డ్రెస్సింగ్ పద్ధతులను రూపొందించాలని భావిస్తున్నానన్నారు. తన తల్లిదండ్రులు, సోదరి కుటుంబం తనను ఎంతో ప్రోత్సహించాయని, భవిష్యత్‌లో తన లక్ష్యాలను గౌరవిస్తూ కెరీర్, శాస్త్ర పరిశోధన, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను గుర్తించగల జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని భావిస్తున్నట్టు వివరించారు.


