21న పల్స్‌పోలియో
గుంటూరు మెడికల్: జిల్లాలో పోలియో కేసులు నమోదు కాకుండా ప్రతి ఒక్కరూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. ఈనెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఏ ఒక్క బిడ్డను వదలకుండా, ముఖ్యంగా వలస ప్రాంతాల పిల్లలు, ఇటుక బట్టీలు, యాచకుల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చెప్పారు. జిల్లాలో ఐదేళ్లలోపు 2,14,981 మంది చిన్నారులు ఉన్నారని చెప్పారు. వీరికి 958 పోలియో చుక్కల కేంద్రాలు (బూతులు) ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 16 ట్రాన్సిట్ పాయింట్లు ఉన్నాయని, 97 మొబైల్ టీమ్‌లు, 4090 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది సూపర్‌వైజర్‌లను, 8 మంది జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు పరస్పరం సహకరించుకుంటూ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో ఉన్న ఐదు సంవత్సరాల లోపల పిల్లలందరి జాబితా తయారు చేసుకోవాలని చెప్పారు. జలుబు, జ్వరం లాంటి చిన్నచిన్న రుగ్మతలు ఉన్నప్పటికీ పోలియో చుక్కలు వేయవచ్చన్నారు. ఈ పోలియో చుక్కలు ప్రతినెలా వేసే పోలియో చుక్కలకు అదనమని పేర్కొన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఏ ఒక్క బిడ్డ మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయాలని ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వలెన్స్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవాని మాట్లాడుతూ 21న బూత్ వద్ద వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. 22, 23 తేదీల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారన్నారు. కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఈ అన్నపూర్ణ, డాక్టర్ బి ఎస్ ఎస్ రోహిణి రత్నశ్రీ, డాక్టర్ సుజాత, సూపర్‌వైజర్ శాస్త్రి పాల్గొన్నారు.


