స్పెషల్ డ్రైవ్ చేపడతాం
● విద్యార్థుల సంఖ్యను పెంచుతాం ● జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ.రేణుక
ప్రత్తిపాడు: ఉర్దూ బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ.రేణుక అన్నారు. ప్రత్తిపాడు ఉర్దూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏడాదికి ఏడాది తగ్గుముఖం పడుతుందని, ఈ ఏడాది ముగ్గురు విద్యార్థులే మిగిలారని, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఉర్దూ బడి.. చతికిల పడి’ కథనంపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. పాఠశాల పరిస్థితిపై డీఈవో ఆరా తీశారు. పూర్తిస్థాయి నివేదికను అందించాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి ఖాసిం, మండల విద్యాశాఖాధికారులు ప్రాథమిక విచారణ నిర్వహించి నివేదికను డీఈవోకి అందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. గుంటూరు ఉర్దూ పాఠశాలల ఉప తనిఖీ అధికారి, మండల విద్యాశాఖాధికారులు సంయుక్తంగా పాఠశాల పరిధిలోని క్యాచ్ మెంట్ ఏరియాలో పర్యటించి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు.


