పరిశుభ్రతపై అవగాహన అవసరం
● కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ● లాలుపురంలో ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం
గుంటూరు రూరల్: వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని లాలుపురం గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వివిధ పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– 2047 లక్ష్యంగా అందరూ కృషి చేయాలని అన్నారు. విద్యార్థులు పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాలని, పెద్దలకు కూడా దీనిపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని తెలిపారు. ప్రభు త్వం చేపట్టే కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావడం ద్వారా నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తామని తెలిపారు. ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ రథం పనితీరును పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్ ప్రసంగించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కళ్యాణచక్రవర్తి, ఆర్డీవో కే శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సాయికుమార్, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, గుంటూరు వెస్ట్ తహసీల్దార్ వెంకటేశ్వరరావు, రూరల్ ఎంపీడీవో బండి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీవో కే శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాని, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత కనీస బాధ్యత
గుంటూరు వెస్ట్: మనం నివాసముండే ప్రాంతాల్లో కనీస పరిశుభ్రత పాటించాల్సిన బాధ్యత మనపై ఉందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాంగంగా జేసీతోపాటు డీఆర్వో షేఖ్ ఖాజావలి, డీపీఓ నాగసాయి కుమార్, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు అధికారులు పరిసరాలను శుభ్రపరిచారు. జేసీ మాట్లాడుతూ పరిశుభ్రంగా ఉండటానికి పెద్దగా ఖర్చుండదన్నారు. దీనిని మన ఇంటి నుంచే ప్రారంభించాలన్నారు. పెద్దలు ఇది పాటిస్తే పిల్లలు కూడా వారిని చూసి నేర్చుకుంటారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చెత్తను సేకరించేందుకు అనేక మార్గాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రజలు కొంచెం బాధ్యత వహిస్తే ఆహ్లాదకరమైన సమాజ ఏర్పాటుకు సహకరించిన వారవుతారన్నారు. దీంతోపాటు ఇళ్ల పరిసర ప్రాంతాల్లోనూ, పార్కుల్లోనూ చెట్లను పెంచాలని కోరారు.


