ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
ప్రత్తిపాడు: ట్రాక్టర్ బోల్తా పడి రైతు దుర్మరణం చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామానికి చెందిన ఈదర శంకర్‌రెడ్డి (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో పంట సాగు చేసే నిమిత్తం శనగలు వెద పెట్టాడు. ఆదివారం మరొక పొలంలో శనగలు వెద పెట్టేందుకు కోల్డ్ స్టోరేజీ నుంచి శనగల బస్తాలను ట్రాక్టర్‌పై తీసుకుని సాయంత్రం సమయంలో ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో గ్రామంలోని వాగుపైనున్న బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ట్రాక్టర్ నడుపుతున్న శంకర్‌రెడ్డి ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


