విజ్ఞాన భాండాగారాలు
జేసీ అశుతోష్ శ్రీవాస్తవ
గ్రంథాలయాలు
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. శనివారం 58వ జాతీయ వారోత్సవాల్లో భాగంగా అరండల్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి, విజ్ఞానదాయకమైన పుస్తకాలను చదవాలని సూచించారు. విజ్ఞానాన్ని పెంపొందించుకుని, విలువలు గల భావి భారత పౌరులుగా ఎదగాలని ఉద్బోధించారు. గ్రంథాలయాలు, పుస్తక పఠనం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. గ్రంథాలయాలు అంటే తనకు ఎంతో ఇష్టమని విద్యార్థులకు ఏ అవసరమైన తప్పకుండా సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ, డిప్యూటీ లైబ్రేరియన్ కందుల ఝాన్సీలక్ష్మి, డాక్టర్ ఉప్పల శ్రీనివాస్ ప్రసాద్, విశ్రాంత ఉద్యోగి ఎంఎస్ సుభానీ, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
గార్డెన్స్ గ్రంథాలయంలో
బృందావన్ గార్డెన్స్‌లోని మహిళా బాలల గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను వయోజన విద్య విశ్రాంత డైరెక్టర్ చావా బోసు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖ పోటీలు నిర్వహించారు. గ్రంథాలయాధికారి బి.శకుంతల, పాఠకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.


