
25న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సభ
తెనాలి: పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో లీటరుకు రూ.8–10 ప్రోత్సాహకధర ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన తెనాలిలో సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి కోరారు. తెనాలిలో మంగళవారం పాడిరైతులతో కలసి మహాసభ ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెనాలి అయితానగర్‌లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కల్యాణమండపంలో 25న ఉదయం 10 గంటలకు మహాసభ జరుగుతుందని తెలిపారు. గేదెపాలు లీటరుకు రూ.40, ఆవు పాలు రూ.20కు మించి డెయిరీల్లో ధర రావటం లేదన్నారు. పాడి పశువులకు బీమా మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించాలని తెలిపారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని సంఘం జిల్లా నాయకురాలు వేజెండ్ల తబిత కోరారు. తెనాలి శాంతకుమారి, మాన్యం పద్మ, ఎల్లమాటి మేరమ్మ, కె.శకుంతల ఎ.సరోజిని, టి.నిర్మల, సంతోషం, సుశీల తదితరులు పాల్గొన్నారు.