
వైద్యారోగ్యశాఖ పూర్తిగా విఫలం
మాజీ మంత్రి విడదల రజిని, సమన్వయకర్తలు నూరిఫాతిమా, వనమా బాల వజ్రబాబు అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులకు గుంటూరు జీజీహెచ్‌లో పరామర్శ
గుంటూరు మెడికల్: కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులను మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కురపం హాస్టల్‌లో ఇద్దరు చనిపోయారని గుర్తుచేశారు. , తాజాగా అనపర్రు హాస్టల్‌లో 31 మంది అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనపర్రు బీసీ హాస్టల్ వార్డెన్ వేధింపులను తట్టుకోలేక విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాగే, తురకపాలెంలో పదుల సంఖ్యలో చనిపోయినా ఇప్పటి వరకు కారణాలు నిగ్గుతేల్చలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. గుంటూరు నగరంలో 200 మందికిపైగా డయేరియాతో జీజీహెచ్‌లో చికిత్స పొందినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పనిచేయడం లేదని, అది పూర్తిగా ఫెయిల్ అయిందని అన్నారు.
వారం రోజుల్లో హాస్టళ్లకు...
సంక్షేమ హాస్టళ్లు నేడు సంక్షోభంలో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో తాము తనిఖీలు చేశామన్నారు. వారం రోజుల్లో వాటిని పరిష్కరించని పక్షంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టల్స్ బాట పడతామని స్పష్టం చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా బాలవజ్రబాబు, నాయకులు, తదితరులు ఉన్నారు.