
ఈత పోటీలలో రైల్వే ఉద్యోగి ప్రతిభ
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వేలోని గుంటూరు డివిజనులో లోకో పైలట్ (గూడ్స్) గంపల సాంబశివరావు ఈత పోటీలలో ప్రతిభ చాటారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ఈత పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా సంస్థకు కీర్తి తెచ్చిపెట్టారని గుంటూరు డీఆర్‌ఎం సుథేష్ఠసేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో మంగళవారం సాంబశివరావును ఘనంగా సత్కరించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీల్లో మంగళగిరిలో ఎస్.మహబూబ్ షంషేర్ ఖాన్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో సాంబశివరావు 2 బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 8వ అంతర్ జిల్లాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో సైతం 4 బంగారు పతకాలను కై వసం చేసుకున్నారని తెలిపారు. ఏడీఆర్‌ఎం ఎం.రమేష్‌కుమార్, అధికారులు అభినందించారు.