
నేడు విద్యుత్ లోక్ అదాలత్
తాడికొండ: విజయవాడకు చెందిన కన్సూమర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్‌ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం రాయపూడిలోని విద్యుత్ భవన్‌లో అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అమరావతి క్యాపిటల్ ఈఈ సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ భవన్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరగనుంది. సీఆర్‌డీఏ సర్కిల్, అమరావతి క్యాపిటల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. విజయవాడ సీజీఆర్‌ఎఫ్ చైర్మన్, రిటైర్డ్ జడ్జి ఎన్ విక్టర్ ఇమ్మాన్యుయేల్, సాంకేతిక సభ్యుడు డి. కృపానాయక్, ఆర్థిక సభ్యుడు ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు, స్వతంత్య్ర సభ్యులు సునీత, ఎస్‌ఈ ఎం. శ్రీనివాసరావు పాల్గొంటారని పేర్కొన్నారు.
నెహ్రూనగర్: స్వయం ఉపాధి పథకాలపై ఎస్సీ యువతకు బుధవారం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో (జిల్లా పరిషత్ కార్యాలయం రోడ్) అవగహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాలపై జిల్లాస్థాయిలో అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారని చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువత ఈ అవగాహన సదస్సుకు హాజరై ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు.
నరసరావుపేట రూరల్: అధిక ధరకు మొక్క జొన్న విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు విత్తన స్టాక్ రిపోర్ట్‌ను అందజేయాలని తెలిపారు. రైతుకు ఇచ్చే బిల్లు మీద తప్పనిసరిగా లాట్ నెంబర్ వేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేయాలని, విత్తన చట్టానికి లోబడి ప్రతి డీలరు వ్యాపారం చేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతరావు, నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, ఏఓ శాంతి, డీలర్లు పాల్గొన్నారు.