ముమ్మాటికీ కూటమి హత్యలే !
ముమ్మాటికీ కూటమి హత్యలే ! ● వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు మాట్లాడుతూ మెలియాయిడిసీజ్ వ్యాఽధి ఒక్కరోజులో తగ్గేది కాదని, బాధితులకు జాగ్రత్తగా చికిత్స చేయాలని తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గ్రామ ప్రజలపై వివక్ష చూపారని ఆయన ఆరోపించారు. దళితులే ఎక్కువగా చనిపోయారు కాబట్టి గ్రామాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రాణాలకు రూ 5 లక్షల విలువ కట్టి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నా సీఎం చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌లు పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
● నియోజకవర్గ ఇన్‌చార్జ్ బలసాని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ మృతుల కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గ్రామంలో వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలని కోరారు.
● మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల్లో 45 మంది చనిపోతే 29 మందికి ఎక్స్‌గ్రేసియా ప్రకటించడం బాధాకరమని పేర్కొన్నారు. అదికూడా అందరికీ దక్కకపోవడం విచారకరమని తెలిపారు. గ్రామంలో సామాజిక బహిష్కరణలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఖండించారు. గ్రామస్తులు పనులకు వెళ్లినా, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లినా వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. బంధువులు కూడా గ్రామస్తులను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
● మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కృష్ణ గుంటూరు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టే లేదని మండిపడ్డారు. నెల రోజుల్లో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ట్రస్ట్ ద్వారా గ్రామంలో తాగునీటి సౌకర్యార్థం వాటర్ ప్లాంట్‌ను నిర్మిస్తామని తెలిపారు.
● సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ సుధీర్‌బార్గవరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 365 రోజులు, 24 గంటలు కార్పొరేట్ వైద్యం అందేలా చేస్తేనే ప్రజల ఆరోగ్యం మెరుగు పడుతుందని సూచించారు.
● వైఎస్సార్‌సీపీ వైద్యుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శివభార్గవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్యం రంగం పడకేసిందని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు.
● తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జ్, నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా మాట్లాడుతూ నిండు ప్రాణం ఖరీదు రూ. 5 లక్షలు కట్టటం బాధాకరమని, కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలంటే విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని తెలిపారు.
● గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ గ్రామంలో 45 మంది చనిపోయినా రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. నారా లోకేష్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజల రక్షణకు, ఆరోగ్య భద్రతకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
● నియోజకవర్గం పరిశీలకుడు గులాం రసూల్ మాట్లాడుతూ తురకపాలెం గ్రామానికి గుంటూరు నుంచి పైప్‌లైన్ నిర్మించి త్రాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
తురకపాలెంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ మరణాలకు కూటమి ప్రభుత్వమే కారణం గ్రామస్తులపై వివక్ష, సామాజిక బహిష్కరణ బాధాకరం 45 మంది చనిపోతే 29 మందికే పరిహారమా ? గ్రామస్తులకు న్యాయం జరిగే దాకా వైఎస్సార్ సీపీ పోరాటం
గుంటూరు రూరల్: తురకపాలెంలో మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామాన్ని బుధవారం వైఎస్సార్ సీపీ నేతలు సందర్శించారు. అంతుచిక్కని వ్యాధితో అకాల మరణాలకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంకా జ్వరం, శరీరంపై గడ్డలతో బాధపడుతున్న బాధితుల ఇళ్లకు వెళ్లి మనోధైర్యాన్ని కల్పించారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు వైద్యుల బృందం బాధితుల రిపోర్టులు పరిశీలించి వైద్య సలహాలను అందించింది. గ్రామస్తులను పలకరించి వారి సమస్యలు, సంఘటనలు జరిగిన తీరును నాయకులు తెలుసుకున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం
కూటమి ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని, నిర్లక్ష్యాన్ని విడనాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నినాదాలు చేశారు. గ్రామస్తులను సామాజిక బహిష్కరణ చేయడం సబబుకాదని నినాదాలు చేశారు.