
మొబైల్‌ఫోన్లు బాధితులకు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఫోన్లను తిరిగి అప్పగించారు. సుమారు రూ.50 లక్షల విలువైన 250 ఫోన్లను మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బాధితులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఫోన్లను పొగోట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే సమాచారం దుర్వినియోగం కాదని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.6.82 కోట్ల విలువైన 3,414 ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. హెల్ప్ నంబర్ 86888 31574 లేదా సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఐటీ కోర్ సీఐ నిషార్ బాషా, హెచ్‌సీ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్‌సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఏస్ హెచ్‌సీ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు.