ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు స్పందన | - | Sakshi
Sakshi News home page

ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు స్పందన

Sep 22 2025 7:02 AM | Updated on Sep 22 2025 7:02 AM

ఎంబీఏ

ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు స్పందన

ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు స్పందన దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు పశ్చిమ డెల్టాకు 6,834 క్యూసెక్కులు విడుదల 24 నుంచి డ్రెయిన్స్‌పై ఆక్రమణల తొలగింపు

పెదకాకాని(ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున విద్యాలయం దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించిన రెండేళ్ల ఎంబీఎ, ఎంసీఎ ప్రవేశ పరీక్షకు అనూహ్య స్పందన లభించిందని కో–ఆర్డినేటర్‌ ఆచార్య దిట్టకవి రామచంద్రన్‌ తెలిపారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లుతో కలసి ఆదివారం ఆయన ఏఎన్‌యూలో పరీక్ష నిర్వహణను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 10 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష సజావుగా జరిగినట్లు పేర్కొన్నారు. మొత్తం 720 మంది దరఖాస్తు చేసుకోగా 522 మంది హాజరయ్యారన్నారు. ఇందులో ఎంబీఏకు 449 మంది, ఎంసీఏకు 73 మంది పరీక్ష రాశారని తెలిపారు. ఎంబీఏలో ఇప్పటికే ఉన్న స్పెషలైజేషన్‌తో పాటు నూతనంగా ఎంబీఏ ఫైనాన్స్‌, ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని పలువురు విద్యార్థులు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షల ప్రత్యేక పరిశీలకులుగా కె. శశిధర్‌, ఎన్‌. బాబు వ్యవహరించారు. ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదల అవుతాయని పరీక్షల కో–ఆర్డినేటర్‌ దిట్టకవి రామచంద్రన్‌ తెలిపారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు దసరా సెలవులను పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 6,834 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ హైలెవెల్‌కి 140 క్యూసెక్కులు, బ్యాంక్‌ కెనాల్‌ 1,685, తూర్పు కాలువకు 607, పశ్చివ కాలువకు 247, నిజాపట్నం కాలువకు 436, కొమ్మూరు కాలువకు 2,980 క్యూసెక్కులు, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,17,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నగర కమిషనర్‌

పులి శ్రీనివాసులు

నెహ్రూనగర్‌: నగరంలో ఈనెల 24వ తేదీ నుంచి రోడ్లు, డ్రెయిన్స్‌ మీదకు వచ్చిన ర్యాంపులు, మెట్ల తొలగింపు ప్రక్రియ చేపడతామని నగర కమిషనర్‌ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలో వర్షం పడిన ప్రతిసారి పలు ప్రాంతాలు మునిగిపోవడంతో ఆదివారం సాక్షి దినపత్రికలో ‘గుంటూరు నెత్తిన నీటి కత్తి’ అనే కథనం ప్రచురితమైంది. దీనికి కమిషనర్‌ పై విధంగా స్పందించారు. నగరంలో గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. రోడ్లమీద పడిన వర్షం డ్రెయిన్‌లలోకి వెళ్లడానికి వీల్లేకుండా ర్యాంపులు, మెట్లు ఏర్పాటు చేయడం వల్లనే ఈ సమస్య ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా స్వచ్ఛందంగా తొలగించుకోమని చెప్పినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. దీనివల్ల చిన్నపాటి వర్షాలకు కూడా నీరు నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. డ్రెయిన్లను మూసేస్తూ ఏర్పాటు చేసిన ర్యాంపులు, మెట్లను మంగళవారం సాయంత్రం లోపు తొలగించుకోవాలని, లేనిపక్షంలో బుధవారం ఉదయం నుంచి నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక సిబ్బంది వార్డుల వారీగా జేసీబీలతో తొలగింపు ప్రక్రియ చేస్తారని తెలిపారు. జరిగిన నష్టానికి సంబంధిత నిర్మాణదారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు స్పందన 
1
1/1

ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్షకు స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement