
నేటి నుంచి శివాలయంలో దసరా ఉత్సవాలు
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో 22 నుంచి అక్టోబరు 2 వరకూ దేవీ శరన్నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు డీసీ గోగినేని లీలాకుమార్ ఆదివారం తెలిపారు. ఉత్సవాల్లో ప్రతినిత్యం సుప్రభాత సేవ, పంచ హారతులు, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనాలు, పంచగవ్య ప్రాశనలు శాస్త్రోక్తంగా జరుగుతాయని తెలిపారు. శరన్నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని భ్రమరాంబ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపురసుందరీదేవి, కదంబ వనవాసినీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దనీ దేవి, రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తారని వివరించారు. అక్టోబరు 2 విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంకాలం శమీపూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఏవో తెలిపారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. ప్రతిరోజూ విశేష పూజలతో పాటు రాత్రివేళల్లో భక్తులకు కాలక్షేపంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
నేడు బాలా త్రిపురసుందరీ దేవిగా
భ్రమరాంబ
తొలిరోజు భ్రమరాంబ అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. సోమవారం తెల్లవారుజామున సుప్రభాతసేవ, హారతులతో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి కుంకుమార్చనలు, పంచహారతులు, ఆలయ ప్రదక్షిణ, తీర్థ ప్రసాదాల పంపిణీ ఉంటాయి. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భజన, కూచిపూడి నృత్యం, పౌరాణిక నాటకాల్లోని సన్నివేశాలు ఉంటాయి.