
కిడ్నాప్, హత్య కేసులో నలుగురు అరెస్ట్
లక్ష్మీపురం: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి విద్యుత్ తీగతో గొంతు నులిమి హతమార్చి మృతదేహాన్ని గుండ్లకమ్మ కాలువలో పడేసిన కేసులో నలుగురు నిందితులను నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన సీతమ్మ కాలనీకి చెందిన వేముల రామాంజనేయులు కనిపించడం లేదని ఆయన భార్య శివపార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం ఎస్సై రమాదేవి, మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచనల మేరకు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, స్టేషన్ ఇన్‌చార్జి సీఐ ఆరోగ్యరాజు, ఎస్సై రాంబాబు, ప్రసన్నకుమార్, రమాదేవి, పట్టాభిపురం ఎస్సై నాగేంద్రలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. అదే ప్రాంతానికి చెందిన బండారు కొండయ్యపై అనుమానం వ్యక్తం చేసి స్టేషన్‌కు తరలించి విచారించారు. కొండయ్య భార్య శ్రీలక్ష్మికి, వేముల రామాంజనేయులు మధ్య గతంలో వివాహేతర సంబంధం ఉండేది. దీనిని ఆసరాగా తీసుకుని శ్రీలక్ష్మిని రామాంజనేయులు తరచూ డబ్బులు అడుగుతూ ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆమె భర్త కొండయ్యకు తెలియజేసింది. రామాంజనేయులు వేధింపులు భరించలేకపోతున్నానని, ఎలాగైనా హతమార్చమని చెప్పింది. ఈనెల 6వ తేదీన మధ్యాహ్నం 4 గంటల సమయంలో కొండయ్య తన స్నేహితులైన ఏసుభక్తనగర్ ప్రాంతానికి చెందిన కోలా దిలీప్, వికలాంగుల కాలనీ, కేవీపీ కాలనీకి చెందిన నాగుల్ మీరాలతో కలసి హత్యకు పథకం రచించారు. నాగుల్ మీరా ద్వారా రామాంజనేయులుకు ఫోన్ చేసి హౌసింగ్ బోర్డు కాలనీ సెంటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వెనుక నుంచి అంకిరెడ్డిపాలెం వెళ్లే దారిలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు పిలిపించారు. కొండయ్య, దిలీప్, నాగుల్‌మీరాలు ముగ్గురు కలిసి రామాంజనేయులును కారులో బలవంతంగా ఎక్కించారు. అంకిరెడ్డిపాలెం నుండి హైవే వైపు తీసుకెళ్లి, పొత్తూరు ఈనాడు ఆఫీస్ సమీపంలో హైవే సర్వీస్ రోడ్‌లో కారు ఆపారు. కొండయ్య, రామాంజనేయులుతో గొడవ పడ్డాడు. కారు ముందు సీటులో కూర్చుని ఉన్న రామాంజనేయులు మెడకు వెనుక కూర్చున్న కోలా దిలీప్, నాగుల్ మీరాల సహాయంతో కరెంటు వైర్‌తో బిగించి హతమార్చారు. ముగ్గురూ కలిసి కారులో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం, వెల్లంపల్లి గ్రామ పరిధిలోని గుండ్లకమ్మ వాగు బ్రిడ్జిపై నుంచి నీటిలో రామాంజనేయులు మృతదేహాన్ని పడేశారు. బయటకు కనబడకుండా దానిపై ఇసుక మూటలు వేశారు. కొండయ్య తెలిపిన విధంగా ఈనెల 15న పోలీసులు గుండ్లకమ్మ వాగు వద్దకు వెళ్లి పరిశీలించి, 16వ తేదిన మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన కోలా దిలీప్, నాగుల్‌మీరాలతోపాటు కొండయ్య భార్య శ్రీ లక్ష్మిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేసిన సీఐ ఆరోగ్యరాజు, ఎస్సైలు రాంబాబు, ప్రసన్నకుమార్, రమాదేవి, నాగేంద్రలతో పాటు సిబ్బంది శ్రీనివాస్, ఉదయ్‌చంద్, గంగరాజ్, నాగరాజులను డీఎస్పీ అభినందించారు.
వివరాలు వెల్లడించిన వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్