మహిళ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

మహిళ అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

Sep 18 2025 6:52 AM | Updated on Sep 18 2025 12:49 PM

సత్తెనపల్లి: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందడంపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని వడ్డవల్లి ఆంజనేయస్వామి గుడి వెనుక ఏరియాలో నివశిస్తున్న పసుపులేటి రాధిక (27) ఈనెల 12వ తేదీన పిల్లలు ఆడుకుంటూ గ్లాసులో కూల్‌డ్రింక్‌ పోసి చేతికి దొరికిన ఎలుకల మందును దానిలో కలిపి వెళ్లారు. అది గ్రహించని రాధిక, పిల్లలు కూల్‌డ్రింక్‌ గ్లాస్‌లో పోశారనుకుని తాగింది. కొద్దిసేపటికి నోటి వెంట నురగలు రావడంతో భర్త గోపీకి ఫోన్‌ చేసి కూల్‌డ్రింక్‌ తాగితే నోటి వెంట నురగలు వస్తున్నాయని చెప్పింది. దీంతో భర్త హుటాహుటిన ఇంటికి చేరుకొని చూడగా సమీపంలో ఎలుకల మందు ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకు వెళ్ళమని సూచించారు. గుంటూరులోని కిమ్స్‌ వైద్యశాలలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. దీంతో అనుమానాస్పద మృతిగా పట్టణ ఎస్‌ఐ జె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి మృతికి కారకులైన ముగ్గురు అరెస్టు 

యడ్లపాడు: మద్యం షాపు వద్ద జరిగిన దాడి కారణంగా మృతి చెందిన యువకుడి కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సంగం గోపాలపురం గ్రామానికి చెందిన వేల్పూరి శ్రీనాథ్‌ ఈ నెల 14వ తేదీన బోయపాలెం గ్రామంలోని మద్యం దుకాణం వద్ద మద్యం తాగుతుండగా తన భార్య అక్క కొడుకు పోట్లూరి విష్ణుతో వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న మల్లవరపు చందు మణికంఠ, రావూరి విజయ్‌ విష్ణుతో కలిసి ముగ్గురూ కలిసి శ్రీనాథ్‌ను తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలతో ఇంటికెళ్లిన శ్రీనాథ్‌ ఛాతీ నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతుని అన్న సాంబయ్య ఫిర్యాదు మేరకు యడ్లపాడు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు కారణమైన మల్లవరపు చందు మణికంఠ, పోట్లూరి విష్ణు, రావూరి విజయ్‌లను మంగళవారం బోయపాలెంలో అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వీరిని చిలకలూరిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు తెలిపారు.

12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వై.థామస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని కోరారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధుల నుంచి మినహాయింపు కల్పించాలని, పాఠశాలల్లో ఒత్తిడి లేకుండా పని చేసే వాతావరణాన్ని కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం 

చెరుకుపల్లి: గూడవల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి గానూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఆర్‌. శ్యాంప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు మూడు దఫాలు దరఖాస్తులను ఆహ్వానించామన్నారు. ఇంకా సీట్లు మిగిలిపోవడంతో నాలుగో సారి కూడా ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల కోర్సులు ఎలక్ట్రికల్‌, ఫిట్టర్‌, మోటార్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్‌మన్‌ సివిల్‌తో పాటు ఒక సంవత్సరం కోర్సు మెకానిక్‌ డీజిల్‌ సీట్లకు iti.ap.gov.in వెబ్‌సైట్‌లో ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

పదో తరగతి పాస్‌ మార్కుల ఆధారంగా మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పదవ తరగతి పాస్‌మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్‌ కార్డు, ఫొటో, మెయిల్‌ ఐడీ, పర్మినెంట్‌ సెల్‌ నంబర్‌తో ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 7702400570, 9398650408, 9491185900 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కళాశాలలో 29న 10 గంటలకు అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement