
పల్నాడు జిల్లాకు రెండో విడత ఎరువులు రాక
నాదెండ్ల: పల్నాడు జిల్లాకు రెండో విడతగా 1185 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులను ప్రభుత్వం కేటాయించిందని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు చెప్పారు. సాతులూరులోని రైల్వే ర్యాక్ పాయింట్‌ను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కేటాయించిన ఎరువులను రైతులకు పంపిణీ చేశామన్నారు. రెండో విడతలో స్పిక్ యూరియా 530 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 210 మెట్రిక్ టన్నులు, డీఏపీ 445 మెట్రిక్ టన్నులు వచ్చాయన్నారు. వీటిని సొసైటీలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎరువులు రైతులకు సక్రమంగా అందేలా స్థానిక వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా ఏడీఏ కార్యాలయం సిబ్బంది హనుమంతరావు, శ్రీనివాసరావు, ఏఓ శ్రీలత పాల్గొన్నారు.
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–19 స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుట్‌బాల్, సెపక్ తక్రా బాలబాలికల జట్ల ఎంపికలు బుధవారం నిర్వహించారు. ఈ ఎంపికలను ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.నరసింహారావు పర్యవేక్షించారు. కార్యక్రమంలో అండర్–19 స్కూల్ గేమ్స్ జాయింట్ సెక్రటరీ కె.పద్మాకర్, పల్నాడు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎ.సురేష్ కుమార్, విద్యా కేంద్రం డైరెక్టర్ నిమ్మగడ్డ చిట్టిబాబు, ప్రిన్సిపాల్ షేక్ మౌలాలి, ఫిజికల్ డైరెక్టర్ పి.శివరామకృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబశివరావు, బి.అనిల్ దత్త నాయక్, కోనంకి కిరణ్ కుమార్ ఫుట్‌బాల్ కోచ్‌లు పి.సురేష్, పి.వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొంటారని స్కూల్ గేమ్స్ కార్యదర్శి జి.నరసింహారావు తెలిపారు.
ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు
వేటపాలెం: వేగంగా బైక్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బైపాస్ నుంచి కొత్తపాలెం వెళ్లే రోడ్డులో ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జబ్బార్ కాలనీకి చెందిన కొమ్ము జగదీష్, గొల్ల మోజెస్ స్నేహితులు. వేటపాలెం బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరిగే స్కూల్ గేమ్స్‌కు వెళ్లారు. కాగా కొత్తపాలెం గ్రామానికి చెందిన స్నేహితుడిని వదిలి రావడానికి ముగ్గురు బైక్‌పై వెళ్లారు. స్నేహితుని అక్కడ వదిలారు. తిరిగి వచ్చే సమయంలో బైక్ వేగంగా నడపడంతో మలుపులో అదుపు తప్పి రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టారు. బైక్ నడుపుతున్న కొమ్ము జగదీష్‌కి ముఖంపై తీవ్ర గాయాలవ్వగా, వెనుక కూర్చున్న మోజెస్‌కి స్వల్ప గాయాలయ్యాయి. 108లో ఇద్దరినీ తొలుత చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి జగదీష్‌ని మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలలో చేర్చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పల్నాడు జిల్లాకు రెండో విడత ఎరువులు రాక