
ఆచార్య అమృతవల్లికి జీవిత సాఫల్య పురస్కారం
పెదకాకాని(ఏఎన్‌యు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రం, సూక్ష్మజీవ శాస్త్ర విభాగంలో ఆచార్యులుగా సేవలు అందిస్తూ విస్త్రృత పరిశోధనలు చేస్తున్న ఆచార్య అడిపూడి అమృతవల్లికి జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఉత్తమ ఆచార్యులుగా, పరిపాలకురాలిగా పురస్కారం ఆమెను వరించింది. ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ భారతీయ శాఖ ఆధ్వర్యంలో జమ్మూలో 14,15,16 తేదీల్లో జరిగిన జాతీయ సదస్సుకు అమృతవల్లి అధ్యక్షత వహించారు. దశాబ్దం పైగా పీజీపీఆర్ అధ్యక్షురాలిగా, మూడు దశాబ్దాలకు పైగా అధ్యాపకురాలిగా పరిశోధకురాలుగా ఆమె చేస్తున్న సేవలకు గానూ ఈ పురస్కారం లభించింది. షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ టెక్నాలజీ ఆఫ్ జమ్మూ ఉపకులపతి బి.ఎన్. త్రిపాఠి, ఘజియాబాద్‌లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్–ఇన్నోవేషన్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ కుమార్ ధార్, అమెరికా ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ చైర్మన్ ఆచార్య ఎం.ఎస్. రెడ్డి, జమ్మూ సీఎస్‌ఐఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ జబీర్ అహ్మద్, ఎస్‌కేయూఏఎస్‌టీ పరిశోధక విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎస్.కె. గుప్తా వంటి ప్రముఖుల చేతుల మీదుగా అమృతవల్లికి పురస్కారం అందించారు. పుడమి– పంటల సంరక్షణే ధ్యేయంగా భారత దేశ వ్యాప్తంగా ఉన్న పరిశోధకులు విజ్ఞాన వేత్తలతో ఈ సదస్సు జరిగింది. నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు, వివిధ విభాగాల అధ్యాపకులు, పలువురు పరిశోధకులు అమృతవల్లికి అభినందనలు తెలిపారు.
షేర్ ఈ కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్
టెక్నాలజీలో ప్రదానం
పుడమి– పంటల సంరక్షణపై జమ్ము విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు