
అవుట్ సోర్సింగ్ టీచర్లను తొలగిస్తే అసెంబ్లీ ముట్టడి
ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్
చిలకలూరిపేట: గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించమని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్ విమర్శించారు. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను బుధవారం ఆయన కలిసి సమస్యలు చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం డీఎస్సీ నియామకాలు చేసే పనిలో ఉందన్నారు. తద్వారా ఇప్పటివరకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 191 గిరిజన గురుకుల పాఠశాలలు ఉండగా అందులో 1700 మంది అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. వీరంతా ఎన్నో ఏళ్లుగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్నప్పటికీ వీరిని తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమాలు చేపడితే చర్చల ద్వారా సమస్య పరిష్కరిస్తామని ఆనాడు గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఉపాధ్యాయులుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే కొంతమంది ఉపాధ్యాయులు హైకోర్టును, జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. వారి ఆదేశాలను సైతం తుంగలో తొక్కివేస్తున్నారని, జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించకపోతే సంబంధిత ఉపాధ్యాయులతో కలసి అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తామని హెచ్చరించారు. పి.స్టాలిన్‌బాబు, జి.ఏసుదాసు, ఇ.నారాయణబాబు, ఎ.అంజన కుమారి, యు.ఊర్మిళ, జి.పవన్‌సుధా పాల్గొన్నారు.