
27 నుంచి వీణా అవార్డ్స్ నాటక పోటీలు
తెనాలి: కళల కాణాచి, ఆర్‌ఎస్‌ఆర్ గ్రీన్‌వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి జాతీయ స్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల వీణా అవార్డ్స్–2025 పోటీలు జరగనున్నాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబరు 2 వరకు మొత్తం ఆరురోజుల పాటు అలరించనున్నాయి. కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు గోపరాజు విజయ్ సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో పోటీలను ప్రకటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పారితోషికాలను అందిస్తున్న ఏకై క పరిషత్ తమదిగా సాయిమాధవ్ వెల్లడించారు.
భారీ బహుమతులు
ప్రతి విభాగంలో మొదటి మూడు బహుమతులకు బంగారు వీణ, రజత వీణ, కాంస్య వీణతోపాటు పద్య నాటకానికి ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు, ప్రదర్శించిన ప్రతి పద్య నాటకానికి రూ.50 వేలు, రచయితకు అదనంగా పారితోషికం అందిస్తున్నామని గుర్తు చేశారు. సాంఘిక నాటకాలకు ప్రతి ప్రదర్శనకు రూ.40 వేలు, బహుమతులుగా రూ.60 వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు, నాటికల్లో ప్రతి ప్రదర్శనకు రూ.30 వేలు, బహుమతుల కింద రూ.50 వేలు రూ.40 వేలు, రూ.30 వేలు ఇస్తున్నట్టు తెలిపారు.
నాటకరంగ ప్రముఖులకు స్మారక పురస్కారాలు
ప్రదర్శనల రోజుల్లో ఏఆర్ కృష్ణ జాతీయ పురస్కారాన్ని సర్రాజు బాలచందర్‌కు, వేద గంగోత్రి వరప్రసాద్ పురస్కారాన్ని నూతలపాటి సాంబయ్యకు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పుర స్కారాన్ని ఉప్పలపాటి సైదులుకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్ మాట్లాడుతూ ఆరు రోజుల్లో తొమ్మిది పద్య నాటకాలు, అయిదు సాంఘిక నాటకాలు, ఏడు సాంఘిక నాటికలు ఉంటాయని చెప్పా రు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల్నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. గౌర వ సలహాదారులు గోగినేని కేశవరావు, వేమూరి విజయభాస్కర్, ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, సంయుక్త కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్‌బాబు, దేవరపల్లి భవాని, కళాకారులు పాల్గొన్నారు.
జాతీయస్థాయిలో పంచమ పద్య, సాంఘిక నాటక, నాటికల పోటీలు
ఆరు రోజుల పాటు 21 ప్రదర్శనలు
ముగ్గురు నాటక రంగ ప్రముఖులకు స్మారక పురస్కారాలు