
తురకపాలెం మరణాలపై కట్టుకథలు
ఒకరిపై ఒకరు నెపాలు
కారణాలు తేల్చకుండా సమస్యను పక్కదోవ పట్టిస్తున్న ప్రభుత్వం
మిస్టరీగానే తురకపాలెం మరణాలు
సాక్షిప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కుగ్రామం తురకపాలెం. పాడిపంటలతో కళకళలాడుతున్న గ్రామం నేడు మరణ మృదంగంతో ఆందోళనలో ఉంది. గ్రామంలో మూడు నాలుగు నెలల నుంచి వరస మరణాలు చోటుచేసుకుంటున్నా ఇప్పటివరకూ మరణాలకు గల కారణాలు నిర్థారణ కాలేదు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ప్రజలంతా మరణ భయంతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. మీడియాలో వరుస కథనాలతో చలనం తెచ్చుకున్న ప్రభుత్వ యంత్రాంగం వారం రోజులపాటు గ్రామంలో హడావుడి కార్యక్రమాలు చేపట్టింది. ప్రతిరోజూ ఉచిత వైద్య శిబిరాలు, ఆహారం, భోజనం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ప్రజలు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు. ప్రజల్లో వరుస మరణాలపై ఉన్న భయాలు ఏమాత్రం తొలగిపోలేదు. అంతేకాకుండా రోజురోజుకు గ్రామ ప్రజలు ఎందుకు చనిపోతున్నారనే మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరక్క డెత్ ఫోబియాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కారణం తేల్చని సర్కారు
తురకపాలెం గ్రామంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 29 మరణాలు సంభవించినట్లు వైద్య అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. వీటిల్లో ఒక మరణం అత్యంత అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధిగా నిర్థారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇతర మరణాల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బాధితులు ఎక్కువ అని లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సెప్టెంబరు మొదటివారంలో తురకపాలెం గ్రామంలో మరణ నివేదికను ప్రభుత్వానికి అందజేసి మరణాలు సంభవించకుండా గ్రామంలో వరుసగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్, పీహెచ్‌సీ వైద్యులు, వైద్య సిబ్బంది, సూపర్‌స్పెలిస్టులు, స్పెషలిస్టు వైద్యులు గ్రామంలో సుమారు 40 రకాల పరీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ గ్రామ ప్రజల మరణాలకు గల కారణాలను పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు ఎవరూ నిర్ధారించలేకపోయారు. దీంతో చావుల భయాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.
తురకపాలెం వరుస మరణాలపై ప్రభుత్వ శాఖల్లో సమన్వయం లోపించి మిస్టరీ ఛేదన జరగలేదన్నది జగమెరిగిన సత్యం. ఏ శాఖకు ఆశాఖ తమ తప్పేమీ లేదు, తమ పరిధిలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదనే ధోరణిలో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరికొంత మంది ఒక్క అడుగు ముందుకేసి తప్పిదాలను కింది స్థాయి సిబ్బందిపై నెట్టివేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. తొలుత గ్రామంలో వరుస మరణాలకు అతిగా మద్యం సేవించడం కారణమనే అంచనాలపై నివేదికలు సిద్ధం చేశారు. దానిని పక్కనపెట్టేసి నీటిలో, మట్టిలో ఏమైనా హానికర రసాయనాలు ఉండవచ్చని మరో నివేదిక సిద్ధం చేశారు. మరలా దానిని పక్కనపడేశారు. అత్యంత అరుదైన మెలియోడోసిస్ వ్యాధితో ఒక్కరు మాత్రమే మరణిస్తే మిగతా మరణాలకు కారణాలని తేల్చడంలో విఫలం చెందారు. గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది వరుస మరణాల నివేదికను జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు సకాలంలో అందించలేదని, అందువల్లే మరణాల కట్టడి చేయలేకపోయామంటూ మరొక నివేదిక సిద్ధం చేసి, కింది స్థాయి వైద్య సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధం చేశారు. ఈలోగా మరో కొత్త ఆలోచన వారి మదిలో మెదిలి గ్రామంలోని ఆర్‌ఎంపీలపై వేటు వేసేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేశారు. అధిక మొత్తంలో యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్స్ వాడడం ద్వారా మరణాలు సంభవించాయంటూ ఆర్‌ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేశారు. అయితే ఆ గ్రామంలో కాకుండా పక్కన ఉన్న పెదపలకలూరులో ఆర్‌ఎంపీ క్లినిక్‌ను సీజ్ చేశారు. గ్రామంలో నాలుగు ఆర్‌ఎంపీ క్లినిక్‌లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మందులు, ఇంజక్షన్లు రోగులకు ఇస్తూనే ఉన్నారు. మిగితా ముగ్గురిని వదిలేసి ఒక్కరిపై మాత్రమే వేటు వేయడంతో పలు అనుమానాలకు దారితీసింది. మరోపక్క నీటిలో యూరేనియం నిల్వలు ఉన్నాయని, వాటి ద్వారా మరణాలు సంభవించవచ్చని పచ్చమీడియా ప్రచారం చేసింది. మరోపక్క గ్రామంలో దీర్ఘకాలిక వ్యాధి వల్లే మరణాలు సంభవించాయంటూ మరో కథనం ప్రచారం చేసింది. సాక్షాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గ్రామానికి వచ్చి మరణాలకు గల కారణాలు మీడియాకు వెల్లడించలేదు. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి నివేదిక సిద్ధం కాలేదు. ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేసినప్పటికీ అధికారికంగా జిల్లా యంత్రాంగం నేటి వరకు మరణాలకు కారణాలను వెల్లడించలేదు. పలు మలుపులు తిప్పుతూ మరణాల మిస్టరీని ఛేదించకుండా ప్రభుత్వ యంత్రాంగం కాలయాపన చేసే కొలది గ్రామ ప్రజల్లో మరణ భయం అలాగే ఉండిపోతుంది. మూడు నెలలుగా కంటిపై కునుకు లేకుండా గ్రామ ప్రజలను వేధిస్తున్న డెత్ మిస్టరీని ప్రభుత్వం త్వరితగతిన ఛేదించి ప్రజల్లో భయాందోళనను తొలగించి భరోసా కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తురకపాలెంలో 29 మంది అధికారికంగా చనిపోయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేసిన జిల్లా యంత్రాంగం మరణాలకు గల కారణాలను తేల్చకపోవడంతో తురకపాలెం మరణాలు మిస్టరీగానే మిగిలిపోయాయి. ప్రభుత్వ యంత్రాంగం, ఎందుకు మరణాల మిస్టరీని ఛేదించలేకపోతుందో ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మిస్టరీ ఛేదన లేకపోవడంతో గ్రామ ప్రజల వేదన తీర్చలేకపోతున్నారు.

తురకపాలెం మరణాలపై కట్టుకథలు