
తురకపాలెం బాధితులకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ బాధితులతో కలసి జేసీకి వినతిపత్రం అందజేత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
గుంటూరు వెస్ట్: పేదల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని, బాధితుల గోడు దేవుడే వినాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తురకపాలెం బాధిత కుటుంబాలతో కలిసి సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవను కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కిరణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రెండు మూడు నెలల్లోనే 30 మంది దళిత, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన పేదలు మరణిస్తే ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఏదో కెమికల్ కలవడం వల్లే మరణాలకు సంభవించాయని, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ నీళ్లలో ఏదో కలిసిందని అందుకే చనిపోయారని, స్థానిక ఎంమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కల్తీ మద్యం సేవించడం వల్ల చనిపోయాడరని తమకు ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారన్నారు. ఎవరికి వాళ్లు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు.
పేదలకు న్యాయం చేసే ఉద్దేశంలో ఎవరు లేరని అన్నారు. పేదల కోసం పనిచేస్తామని దొంగ వాగ్దానాలు చేసిన ప్రభుత్వం అదే పేదలు మరణిస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. మరణాలకు 5 నెలల ముందు బాధిత కుటుంబ సభ్యులు నీటి సమస్యలపై పీజీఆర్‌ఎస్‌తోపాటు స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందజేశారన్నారు. ఏ ఒక్కరూ అటువైపు తొంగి చూడలేదని పేర్కొన్నారు. అణగారిన వర్గాల గొంతుగా వైఎస్సార్ సీపీ పనిచేస్తుందన్నారు. బాధితుల తరపున రాజీలేని పోరాటం చేస్తున్నామని, బాధిత కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటప్పారెడ్డి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి వంగా సీతారామిరెడ్డి, నాయకులు బోరుగడ్డ రజనీకాంత్, పిల్లి మేరి, క్రాంతి, బ్రహ్మయ్య, సుధారాణి పాల్గొన్నారు.