
కొరియన్ కంపెనీల్లో విస్తృత అవకాశాలు
చైన్నెలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా చాంగ్ న్యూన్ కిమ్ విజ్ఞాన్ వర్సిటీలో ఘనంగా కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్
చేబ్రోలు: కొరియన్ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా భారత విద్యార్థులు, యువతకు కొరియన్ కంపెనీలలో విస్తృత అవకాశాలను పొందవచ్చని చైన్నెలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా చాంగ్–న్యూన్ కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో గురువారం కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చాంగ్ న్యూన్ కిమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఆసియా ఖండంలో భారతదేశం, కొరియాలు కీలక భాగస్వాములని పేర్కొన్నారు. భద్రతా రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడం అత్యవసరమని తెలిపారు. కొరియా సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కొరియన్ సినిమా ప్రతిభను, సాంస్కృతిక వైవిధ్యాన్ని భారతదేశ ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారని తెలిపారు. భావోద్వేగ ప్రధానమైన డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు, హాస్య చిత్రాలు, కుటుంబమంతా చూసే వినోదాత్మక సినిమాలు మాత్రమే కాకుండా, కొరియా సమాజం, సంస్కృతి, జీవన శైలి, విలువలను కూడా ప్రతిబింబిస్తాయని వివరించారు. కొరియన్ సంస్కృతి ప్రత్యేకతలైన కే పాప్, కే డ్రామా, కే ఫుడ్, కే కాస్మటిక్ వంటి వాటిని విద్యార్థులతో పంచుకున్నారు. కొరియన్ సినిమాల వైశిష్ట్యాన్ని ఆస్వాదిస్తూ, రెండు సంస్కృతుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచడానికి ఈ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందని పేర్కొ న్నారు. ఈ ఫెస్టివల్‌లో కొరియా సంస్కృతి, సినిమాలు విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కొరియన్ కంపెనీల్లో విస్తృత అవకాశాలు