
పోరాటాలతోనే ఐసీడీఎస్ పరిరక్షణ
లక్ష్మీపురం: సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) పరిరక్షణకు అంగన్‌వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా 10వ మహాసభను గురువారం పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతుందని, ఈ కాలంలో ప్రభుత్వాలు ఈ స్కీంను నిర్వీర్యం చేయటానికి అనేక ప్రయత్నాలు చేశాయని తెలిపారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నా బలోపేతం చేయటానికి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఏటా బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తోందని, బిల్లులు సకాలంలో విడుదల చేయట్లేదని చెప్పారు. అంగన్‌వాడీలకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని తెలిపారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాని మోదీ అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని, ఐసీడీఎస్‌ను బలోపేతం చేస్తామని వాగ్దానం చేశారని ఆమె గుర్తు చేశారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చినా చిల్లిగవ్వ పెంచలేదని, పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. ఇప్పటికై నా ఈ పథకం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎ.వి.ఎన్.కుమారి, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.