
కొంటాం అంటూనే... కొర్రీ!
తెనాలి: ఆరుగాలం కష్టించి పండించిన పొగాకును అమ్ముకోవటానికి రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల కోసం నెలల తరబడి ఎదురుచూసి, తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక నాణ్యత లేదని తిరస్కరించటంతో దిక్కుతోచటం లేదంటున్నారు. పొగాకును వదిలేసి వెళ్లటం మినహా మరో మార్గం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి..
కొనుగోళ్లు కొంతే..
రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. మార్క్‌ఫెడ్ బయ్యర్లను ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గౌడౌన్లు ఖాళీలేకపోవటంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్‌హౌసింగ్ గిడ్డంగిలో ఈనెల ఒకటో తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూళ్లనిచ్చి, విడతలవారీగా ఏయే కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెస్‌జ్‌లను పంపుతున్నారు. ఆ ప్రకారం సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా కారంచేడు, చీరాల ప్రాంత రైతులు పలువురు మంగళవారం రాత్రికి తమ పొగాకు బేళ్లతో సహా తెనాలిలోని కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే బయ్యర్లు వచ్చి కొంత సరుకును మాత్రమే తీసుకుని మిగిలినది తిరస్కరించారు.
ఎంతోకొంతకు తీసుకోమన్నా..
పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం మూడు గ్రేడ్లను నిర్ణయించింది. కిలో రూ.12, రూ.9, 6 చొప్పున నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొందరు రైతులకు చెందిన పొగాకును కనిష్టమైన రూ.6లకు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని రైతులు చెప్పారు. పొగాకును ఇక్కడకు తరలించటానికే బోలెడు ఖర్చయిందనీ, మళ్లీ ఇప్పుడు దీనిని ఎక్కడికి తీసుకెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బయ్యర్లు నాణ్యత తనిఖీకని బేళ్లను విడదీశారనీ, ఇప్పుడా పొగాకు దేనికీ పనికిరాదని వాపోతున్నారు. కనిష్ట ధరకు కాకపోయినా ఎంతోకొంతకు తీసుకోమని ప్రాధేయపడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటున్నారు.