
కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి దయనీయం
గుంటూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి దయనీయంగా మారిందని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి బలసాని కిరణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం మండలంలోని ఏటుకూరు బైపాస్‌రోడ్డులో గల నియోజకవర్గ కార్యాలయంలో అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలసాని మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను బ్లాక్ మార్కెట్ ద్వారా పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉండగా రైతులు రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు విత్తనాలు సకాలంలో అందుకుని ఎంతో సంతోషంగా ఉండేవారని తెలిపారు. పొగాకు, ఉల్లి, మామిడి రైతుల కష్టాలను చూడకుండా చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లు ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్‌లైట్లు వేసుకుని తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకోసం చేపడుతున్న ఉద్యమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.