
కట్టలు తెగిన రైతుల ఆవేదన
మార్కెట్‌లో దొరకని యూరియా
కొనసాగుతున్న బ్లాక్ మార్కెట్
నానో యూరియా తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధన
తాడికొండలో అధికార పార్టీ నాయకుడి అనుచరుడి దందా
బస్తాకు రూ.100 అదనంగా వసూలు
తాడికొండ: అన్నదాతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సకాలంలో అందించాల్సిన ఎరువుల నిల్వలు అధికార పార్టీకి చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి పోయాయి. చిన్న, సన్నకారు రైతులకు సైతం బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ముమ్మరంగా వ్యవసాయ సీజన్ కొనసాగుతోంది. తాడికొండ, తుళ్లూరు మండలాల్లో పత్తి, మిర్చి అపరాల పంటలు సాగు ఊపందుకుంటోంది. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ ముగిసి మరో 20 రోజుల్లో రబీ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరినాట్లు కూడా ముమ్మరంగా కొనసాగించేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఉన్నట్టుండి యూరియా అందకుండా పోయింది.
రైతుల ఆశలు అడియాస
ప్రైవేటు దుకాణాల్లో అయినా దొరుకుతుందేమో అని ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. బ్లాక్ మార్కెట్ దందా తప్పడం లేదు. బస్తాకు రూ.100 అదనంగా వసూలు చేస్తుండటంతో రైతులు కుదేలవుతున్నారు. కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటికి కూడా అరకొరగానే పంపిస్తోంది. వచ్చిన కొద్దిపాటి బస్తాలు కూడా తమ్ముళ్ల బందిఖానాలోకి వెళ్లిపోతున్నాయి. రైతులకు అరకొరగా బస్తాలు అందించి సొసైటీలు చేతులు దులుపుకుంటున్నాయి.
సీనియర్ నాయకుడి అనుచరుడి దోపిడీ
తాడికొండలో ఓ సీనియర్ నాయకుడి అనుచరుడు రైతుల్ని దోపిడీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో వచ్చిన యూరియా బస్తాలను తరలించుకొని నిల్వ చేసుకొన్నాడను. అత్యవసరం అయిన రైతులకు అదనంగా రూ.100 తీసుకొని అమ్ముకుంటున్నాడు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచి అదుకోవాల్సిన నాయకులే ఇలా బరితెగిస్తే తమ పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి యూరియాతో పాటు డీఏపీని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.