
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలకలూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనాస్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మృతుడు లేత ఆకుపచ్చ చొక్కా, తెలుపు మీద ఎరుపు, నలుపు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద టర్కీ టవల్ ఉండడంతో రైతు అయి ఉంటాడని భావిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహం భాగాలను తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసిన వారు 7207076614 నంబరులో సంప్రదించాలని ఎస్‌ఐ జి. వెంకటాద్రిబాబు సూచించారు.
గుండెపోటుతో వ్యక్తి మృతి
బొల్లాపల్లి: వెల్లటూరులో శుక్రవారం జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గంగనబోయిన గోవిందరాజులు (29) శుక్రవారం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు గోవిందరాజులుకు భార్య భూలక్ష్మితోపాటు ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని కుటుంబాన్ని స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు పరామర్శించి, సంతాపం తెలిపారు.