
బతుకులు సమాధి
వదంతులతో వణుకు
అంతుచిక్కని వ్యాధి..
గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామస్తులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రతి వీధిలో నలుగురైదుగురు మృత్యువాతకు గురవ్వడంతో చిన్నపాటి అనారోగ్యం కలిగినా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నారే గానీ కారణాలు చెప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. తమను పక్క గ్రామాల వారు పనులకు పిలవడం లేదని, జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు.
గ్రామంలో అధికారులు మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు రావాలంటే భయపడుతున్నారు. పరీక్షలు చేసిన తరువాత ఏ రోగం బయటపడుతుందో.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాం కదా! అని కొందరు మిన్నకుండిపోతున్నారు. మరికొందరైతే ప్రభుత్వ వైద్యులను నమ్మలేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. చిన్నపాటి అనారోగ్యానికి పెద్ద మొత్తంలో ఖర్చుచేసి చికిత్సలు తీసుకుంటున్నారు. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేటు వైద్యులు అందిన కాడికి బిల్లులు కట్టించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తురకపాలెం అని పేషెంట్ చెబితే చాలు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
గ్రామంలో మీడియా తిరుగుతుందని తెలిసి అధికారులు హడావుడిగా పర్యటనలు చేశారు. మండల స్థాయి అఽఽధికారుల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ గడిచిన నాలుగు నెలలుగా ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు హడావుడి పర్యటనలు చేస్తున్నారంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది హడావుడిగా గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లుతున్నారు.
జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా ప్రజారోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరిస్తున్నారు. తాగునీటి, మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అని పారిశుద్ధ్యం కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
నాలుగు నెలల కిందట గ్రామంలో ఏర్పాటు చేసిన పొలిమేర రాయి ఒక పక్కకు ఒరగడంతో అనర్థాలు జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలోని పెద్దలు శాస్త్రోక్తంగా గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సరిహద్దు రాయిని సరిచేశారు. ఇప్పటికై నా అకాల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు భావిస్తున్నారు.
భయం గుప్పెట్లో తురకపాలెం
బయటకు రావాలంటే
భయపడుతున్న గ్రామస్తులు
ఎప్పుడు ఏం జరుగుతుందోనని
ఆందోళన
చుట్టాలు కూడా రావడం
లేదని ఆవేదన
ఇతర గ్రామాల్లో పనులకు
వెళ్లాలన్నా రానివ్వడం లేదు
వైద్య శిబిరానికి రావాలన్నా
భయపడుతున్న ప్రజలు
హడావుడిగా కదిలిన యంత్రాంగం
ఇంటి నుంచి బయటకు రావాలంటే భయంతో వణికి పోతున్నారు. అదేదో వైరస్.. బ్యాక్టీరియా అంట.. నీటి ద్వారా, మట్టి ద్వారా వస్తుందంట.. అది రావడంతోనే ఇన్‌ఫెక్షన్‌లకు గురై మృత్యువాతకు గురవుతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రాత్రి 8 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయం కలుగుతుందని వాపోతున్నారు.

బతుకులు సమాధి