
మరణాల వెనక కారణాల నమోదుకు చర్యలు
● వైద్యారోగ్యశాఖ కమిషనర్
వీరపాండియన్
● తురకపాలెంలో పర్యటన
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాలకు దారితీసిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కారణాల నమోదుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. గురువారం తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలలో 30 మరణాలకు దారితీసిన కారణాలను పరిశీలించడానికి ఆయన గురువారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మితో కలసి గ్రామంలో పర్యటించారు. మెడికల్ క్యాంప్‌ను పరిశీలించి అక్కడ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను, పరీక్షల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరపాండియన్ మాట్లాడుతూ వైద్య నిపుణుల బృందాన్ని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేశామని, ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిపారు. నివేదిక ప్రకారం నిర్ణయానికి రావడం సాధ్యపడదని, మైలెడియోసిస్ అని, ఆల్కహాల్ అని చెబుతున్నారని , రక్త నమూనాల పరీక్షల నివేదిక అనంతరం కారణాలను విశ్లేషిస్తామని తెలిపారు. రెండు మూడు రోజులలో కారణాలు తెలుసుకుంటామని, చనిపోయిన వారి మెడికల్ బిల్లులు తీసుకుని సీయంఆర్‌ఎఫ్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ తురకపాలెంలో గత రెండు నెలలుగా మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 14 టీంలను జనరల్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయోలాజీ తదితర ఆరు విభాగాల నుంచి బృందాలను నియమించామని, మరణాలకు గల కారణాలు తెలియాలంటే మూడు రోజులు సమయం పడుతుందని తెలిపారు. గ్రామంలోని మహిళలు కొన్ని సమస్యలను తన దృష్టికి తెచ్చారని, వారు కోరిన విధంగానే బోరు వాటర్ బయటకు పంపకుండా గ్రామంలోనే వినియోగించేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , జెడ్‌పీ సీఈఓ జ్యోతిబసు, డీయం అండ్ హెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డీపీఓ నాగసాయికుమార్, గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, గ్రౌండ్ వాటర్, మెడికల్, పంచాయతీ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.