
10న నాయుడమ్మ అవార్డు ప్రదానం
తెనాలి: తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఆయన జన్మదినమైన ఈనెల పదో తేదీన ప్రదానం చేయనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ వివరాలను మంగళవారం సాయంత్రం ఇక్కడి కుమార్ పంప్స్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ నిర్వాహకులు ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. వివరాలను తెలియజేశారు. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు జరిగే సభలో భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖలో ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును బహూకరిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాధబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీజిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా ఈ అవార్డును ప్రదానం చేస్తామని చెప్పారు. తోలు పరిశ్రమ, ఉత్పత్తుల రంగంలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పేరిట బహూకరించే అవార్డు ప్రదానోత్సవ సభను జయప్రదం చేయాలని ఉపాధ్యక్షుడు కొత్త సుబ్రహ్మణ్యం కోరారు. డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, కె.అరవింద్, కె.నందకిశోర్ పాల్గొన్నారు.