
రాజ్యాంగ విశిష్టత పరిరక్షణే ధ్యేయం
నగరంపాలెం: భారత రాజ్యాంగ విశిష్టతను పరిరక్షించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జి.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. గుంటూరు మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్‌ఏ) రాష్ట్ర 10వ మహాసభ ముగిశాయి. ఆదివారం జరిగిన సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడుతూ అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ డ్యూటీని ఏపీ బార్ కౌన్సిల్ పెంపొందించాలని చెప్పారు. అడ్వొకేట్ వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్‌ను దామాషా పద్ధతిలో పెంచకుండా న్యాయవాదులను మోసం చేస్తుందని ఆరోపించారు. హక్కుల సాధనకు రాష్ట్రంలోని న్యాయవాదులంతా ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నైతికతను కాపాడేందుకు ఐఎల్‌ఏ ముందుంజలో ఉంటుందని తెలిపారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా జి.శాంతకుమార్ (గుంటూరు), ప్రధాన కార్యదర్శిగా పి.నరసింహులు, ఉపాధ్యక్షులుగా బి.డేవిడ్ రత్నకుమార్ (విజయవాడ), గుంటి సురేష్‌బాబు (గుంటూరు), మంతిన అప్పారావు (విజయనగరం), జి.రంగనాయకులు (అనంతపురం), కార్యదర్శులుగా యు.విష్ణుకుమార్, వై.నరేష్ (విశాఖపట్నం), కె.శాంతికుమార్ (ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా), జి.ప్రభుదాస్ (కావలి), బి.చంద్రుడు (కర్నూలు), ఎంఈ.గీతావాణి (గుంటూరు), కోశాధికారిగా మొగల్ కాలేషా బేగ్ (గుంటూరు) ఎన్నికయ్యారు.
ఏపీ హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జి.శ్యామ్‌ప్రసాద్
గుంటూరులో ముగిసిన ఐఏల్‌ఏ రాష్ట్ర 10వ మహాసభలు
రాష్ట్ర అధ్యక్షుడిగా శాంతకుమార్ ఎన్నిక

రాజ్యాంగ విశిష్టత పరిరక్షణే ధ్యేయం