
గుంటూరు నగరపాలక సంస్థ కార్యలయం, గత నెల 22న సాక్షితో ప్రచురితమైన కథనం
గత నెల 22న సాక్షిలో వచ్చిన ‘కోట్లలో తమ్ముళ్ల లూటీ’ కథనంతో మల్లగుల్లాలు పడుతున్న ఇంజినీరింగ్ అధికారులు
టెండర్లలో అవకతవకలపై పూర్తిస్థాయి విచారణకు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశం
ఇప్పటికే డ్రాయింగ్ బ్రాంచ్‌లో పనిచేసే ఆప్కాస్ ఉద్యోగి తొలగింపు
పాత్ర ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సన్నాహాలు
లిస్ట్‌లో బడా కాంట్రాక్టర్లు
అడ్డదారిలో వంద పనులకు పైగా కైవసం?
నెహ్రూనగర్: సాక్షిలో వచ్చిన కథనంతో నగరపాలక సంస్థ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అభివృద్ధి పనుల టెండరింగ్‌లో పాల్గొనకుండానే బడా కాంట్రాక్టర్లు దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి టెండర్లు దక్కించుకున్నారు. పనుల్లో లెస్సు కోట్ చేసి ఆ తరువాత దాన్ని టాంపరింగ్ చేశారు. టెండరింగ్‌లో అవకతవకలపై గత నెల 22న సాక్షి దినపత్రికలో వచ్చిన ‘రూ.కోట్లలో తమ్ముళ్ల లూటీ’ కథనం ఇంజినీరింగ్ విభాగంలోని డ్రాయింగ్ బ్రాంచ్‌లో జరుగుతున్న అవినీతిని వెలుగులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ఆప్కాస్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందో అని భయాందోళనలో ఉన్నారు.
తూతూమంత్రంగా రిపోర్టు
కమిషనర్ ఆదేశంతో ఇంజినీరింగ్ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. వారం రోజుల తరువాత తూతూమంత్రంగా రిపోర్టు అందజేసినట్లు సమాచారం. సాక్షిలో ప్రచురితమైన కథనంపై టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, కార్పొరేటర్ వేముల శ్రీరాంప్రసాద్‌లు కౌన్సిల్ సమావేశంలో అధికారులను నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అడ్డదారిలో వంద పనులు
టెండర్‌లో పాల్గొనకుండా వర్కులు చేసుకున్న జాబితాలో బడా కాంట్రాక్టర్లు(తెలుగు తమ్ముళ్లు) ఉన్నట్లు సమాచారం. ఆదాయం ఉన్న పనులను బ్లాక్ చేసుకుని వాటిని టెండర్ దాకా రాన్వికుండా అడ్డదారిలో దక్కించుకున్నారు. సుమారు వందకు పైగా ఇలా అడ్డదారిలో చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని ద్వారా కార్పొరేషన్‌కు రూ.10కోట్లకు పైగా నష్టం చేకూరిందని సమాచారం. కాంట్రాక్టర్లపై ఆర్‌ఆర్ యాక్ట్(రెవెన్యూ రికవరీ యాక్ట్) కింద డబ్బులు వసూలు చేసేందుకు కమిషనర్ సిద్ధమైనట్లు సమాచారం. విషయం బడా కాంట్రాక్టర్లకు తెలియడంతో ఎలాగైనా బయట పడేందుకు పావులు కదుపు తున్నారు.
ఇంజినీరింగ్ అధికారుల్లో వణుకు
అవకతవకల్లో సంబంధం ఉన్న ఆప్కాస్ ఉద్యోగిని విధుల నుంచి అధికారులు తొలగించారు. మిగతా అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. డ్రాయింగ్ బ్రాంచ్‌లో పనిచేసే ఆప్కాస్ ఉద్యోగులను అక్కడ నుంచి వేరే సెక్షన్‌కు బదిలీ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2018 నుంచి నగరపాలక సంస్థలో పనిచేసిన ఎస్‌ఈలు, హెచ్‌డీ (డ్రాఫ్ట్‌స్ మేన్), జేటీఓ, ఏఈలు, డీఈలు, ఈఈలు ఎక్కడ ఈ వ్యవహారం మెడకు చుట్టుకుంటుందోనని అనుక్షణం భయపడుతున్నారు.
2018 నుంచి జరుగుతున్న తంతు
టెండర్‌లో పాల్గొనకుండా పనులు చేయడం, లెస్సుల్లో మాయాజాలం చేయడం 2018 నుంచి జరుగుతోంది. గత కమిషనర్ కీర్తి చేకూరి ఈ విషయాన్ని పసిగట్టారు. సదరు వర్కులను నిలిపివేశారు. చేసిన వర్కులకు కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేశారు. మరికొంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. డ్రాయింగ్ బ్రాంచ్‌లో పనిచేసే అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు పలువురికి స్థానం చలనం కల్పించారు. కూటమి ప్రభుత్వం రాగానే వారంతా తిరిగి డ్రాయింగ్ బ్రాంచ్‌కు వచ్చారు. దీనికితోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రెచ్చిపోయారు. 2018లో చేసినట్లే ఇప్పుడు కూడా చేశారు. కొంత మంది కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనకుండా పనులు ఏ విధంగా చేస్తున్నారని ఆరా తీస్తే అవినీతి పర్వం వెలుగులోకి వచ్చింది. గత నెల 22న ప్రచురితమైన కథనానికి కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించారు. గత సంవత్సరం నుంచి జరిగిన పనుల వివరాలతో 24గంటల్లో తనకు పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
కేసులు పెడతాం
టెండర్ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడిన ఆప్కాస్ ఉద్యోగిని విధుల నుంచి తొలగిం చాం. దాంతో పాటు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యాం. సమగ్ర విచారణ చేసి రిపోర్టు ఇవ్వాలని ఎస్‌ఈని ఆదేశించాను.
– పులి శ్రీనివాసులు, నగర కమిషనర్