
కౌలు రైతులకు ‘సుఖీభవ’ వర్తింప చేయాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో 60 నుండి 70 శాతం భూమిని కౌలురైతులే సాగుచేస్తున్నారని, వీరికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలంటే భూ యజమాని సంతకం కావాలనే నిబంధన వల్ల గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారన్నారు. ఒక వైపు అధికారులు సీసీఆర్‌సీ కార్డులు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నా ఆచరణలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇవ్వడంలో పాలకపార్టీలు విఫలమయ్యాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని లేనిచో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ దుగ్గిరాల మండలం చినకొండూరు లంకభూముల రైతులకు వ్యక్తిగత పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారని, వీరికి గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో లీడ్ బ్యాంక్ రూ.170 కోట్లు కౌలు రైతులకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆచరణలో అమలు చేయడం లేదని, కౌలు రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. జిల్లాలో నల్లబర్లీ పొగాకు కొనగోలు కేంద్రాలు పెంచి రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనగోలు చేయాలని కోరారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు అందుబాటులో వుంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.సాంబిరెడ్డి, పి.కృష్ణ, అమ్మిరెడ్డి, వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు