
మంత్రితో జరిగిన ఒప్పందాన్ని అమలుచేయాలి
తెనాలి: దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వ ఒప్పందం ప్రకారం క్వింటాలుకు రూ.7,000 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్నా శివశంకరరావు డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగి 17 నెలలు గడిచిందని, ప్రభుత్వంతో ఒప్పందం జరిగి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. ఇప్పటికీ న్యాయం జరక్క రైతాంగం ఆందోళన చెందుతోందని తెలిపారు. బాధిత రైతులు శుక్రవారం తెనాలిలో సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహాను కలిసి సమస్యపై మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పసుపు రైతులకు రూ.20 కోట్ల బీమా పరిహారం వచ్చిందని సబ్ కలెక్టర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ ప్రకారంగా చూస్తే బాధిత రైతులకు క్వింటాలుకు రూ.3–4 వేలు మాత్రమే వస్తుందని చెప్పారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడుతో గతేడాది జులై 10న విజయవాడలోని మార్క్‌ఫెడ్ కార్యాలయంలో జరిగిన ఒప్పందం ప్రకారం నష్టపోయిన పసుపు రైతులందరికీ క్వింటాకు రూ.7,000 ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు మార్కెట్లో క్వింటాలు రూ.13–14 వేలు ఉందని, మార్కెట్ యార్డులో రూ.10,900 ధర పలికిందని గుర్తు చేశారు. తాము నష్టపోతున్నామని తెలిసినా పసుపు రైతులు క్వింటాలుకు రూ.7,000 చెల్లింపునకు అంగీకరించారని శివశంకరరావు చెప్పారు.
అప్పులతో రైతుల అవస్థలు
అగ్ని బాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు వ్యవసాయం చేసేందుకు చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఉందని తెలిపారు. 14 రోజుల కిందట మంత్రి నారా లోకేష్‌ను కలిసినపుడు మంత్రి అచ్చెన్నాయుడుకు బాధ్యత అప్పగించినట్టు చెప్పారని తెలిపారు. బీమా పరిహారం నగదు జాయింట్ అకౌంటులో పడిందని సబ్ కలెక్టర్ చెప్పారని, మిగతా పరిహారం కూడా త్వరగా జమ చేసేలా చూడాలని కోరారు. పసుపు రైతులు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడుతూ రైతాంగం మళ్లీ రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. కార్యక్రమంలో సత్తెనపల్లి పసుపు రైతు లంకిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గద్దె శ్రీహరి బసవయ్య, చందు సత్యనారాయణ, ఆళ్ల గోవిందరెడ్డి, యర్రా వెంకటేశ్వరరావు, గొల్లపల్లి వెంకటసుబ్బారావు, శివారెడ్డి, చందు సత్యనారాయణ, నాదెళ్ల చంద్రశేఖర్, పోతరాజు కోటేశ్వరరావు పాల్గొన్నారు.
పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్
జొన్నా శివశంకరరావు డిమాండ్