
స్థల ఆక్రమణపై విచారణకు హాజరైన కిలారి
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): జీటీ రోడ్డు (మిర్చి యార్డు ప్రాంతం)లో ఉన్న 1,548 గజాల స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య (జనసేన) ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నారని గుంటూరు నగరానికి చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గుమ్మడి రాజారావు భార్య గుమ్మడి భారతి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రోశయ్య, గుమ్మడి భారతిలు మంగళవారం కమిషనర్ సమక్షంలో విచారణకు హాజరయ్యారు. దీనిపై భారతి తెలిపిన వివరాల ప్రకారం .. 1,548 గజాల స్థలాన్ని 1980లో ఓ వ్యక్తి నుంచి వద్ద నుంచి గుమ్మడి భారతి భర్త రాజారావుతో పాటు మరో ఇద్దరు కలిసి స్వాధీన అగ్రిమెంట్ కింద కొనుగోలు చేశారు. అయితే స్థలం అమ్మిన వ్యక్తి 1981లో స్థలాన్ని అప్పు కింద అటాచ్ చేయాలని కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో వాదనలు జరుగుతున్న క్రమంలోనే స్థలం అమ్మిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే తాలుకా వ్యక్తులకు జీపీఏ చేశారు. రాజారావుతో కలిసి ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మాజీ ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. దీంతో 2015లో ఆ స్థలం ముందు భాగంలో ఒక థియేటర్, వెనుక భాగంలో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారు. మధ్యలో ఉన్న రాజారావు స్థలాన్ని అలాగే ఖాళీగా వదిలేశారు. సదరు స్థలాన్ని రాసివ్వాలని పలుమార్లు బెదిరించినప్పటికీ రాజారావు స్పందించకపోవడంతో కారుతో ఢీకొట్టే యత్నం చేశారని ఆమె ఆరోపించారు. రాజారావు గత సంవత్సరం మృతి చెందడంతో తమ స్థలంలో కూడా నిర్మాణం ప్రారంభించారని భారతి తెలిపారు. గొడవను కోర్టులో తేల్చుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారని ఆమె పేర్కొన్నారు.
రోశయ్యను అరెస్టు చేయాలి
అధికారం అడ్డుపెట్టుకుని దళితుల స్థలాలను ఆక్రమిస్తున్న కిలారి రోశయ్యను వెంటనే అరెస్టు చేయాలని దళిత, బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అక్రమాలకు పాల్పడిన కిలారి రోశయ్యను వెంటనే జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు జీఆర్ భగత్ సింగ్, నల్లపు నీలాంబరం, చిన్నం డేవిడ్ విలియమ్స్, జూపూడి శ్రీనివాసరావు, బండ్లమూడి స్టాలిన్, తాటికొండ నరసింహారావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.